వైద్యంలోనూ డ్రోన్ల సాయం!

17 May, 2016 02:44 IST|Sakshi
వైద్యంలోనూ డ్రోన్ల సాయం!

అమెరికా: రోడ్లు సరిగా లేని మారుమూల ప్రాంతాలకు అత్యవసర పరిస్థితుల్లో చేరుకోవాలంటే చాలా కష్టం. ఆఫ్రికన్ దేశమైన రువాండాలో రోడ్లు, మౌలిక వసతుల పరిస్థితి అసలే చాలా ఘోరంగా ఉంటుంది. ఏదైనా ప్రమాదాలు జరిగినపుడు ఆహారపదార్థాలు, మందులు, రక్తం పంపిణీ చేయడం అక్కడి అధికారులకు తలనొప్పితో కూడుకున్న వ్యవహారం. ఈ పరిస్థితి నుంచి బయటపడేందుకు డ్రోన్ల సాయం తీసుకునేందుకు వినియోగించేందుకు రంగం సిద్ధమైంది. వైద్య పరికరాలు, ఇతరత్రా అత్యవసర సామగ్రిని అవసరమైన ప్రదేశానికి పంపేందుకు డ్రోన్ సేవలను రువాండాతో పాటు అమెరికాకు చెందిన జిప్‌లైన్ అనే సంస్థ త్వరలో ప్రారంభించనుంది.

వెయ్యి కొండల దేశమని పేరున్న రువాండాలో దాదాపు 1.1 కోట్ల మంది జనాభా ఉన్నారు. జిప్‌లైన్ అభివృద్ధి చేసిన డ్రోన్లు గంటకు వంద కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ దేశంలోని మారుమూల ప్రాంతాల్లో ఉన్న ఆసుపత్రులకు మందులు, రక్తం, ఇతర సామగ్రి సరఫరా చేస్తాయి. రోజుకు ఎన్ని సార్లయినా ఎక్కడికైనా వెళ్లి రాగలిగే ఈ డ్రోన్ల సైన్యాన్నే సిద్ధం చేస్తున్నారు. గోడౌన్లలోని అధికారులకు ఫోన్ లేదా ఎస్‌ఎంఎస్ ద్వారా డాక్టర్లు సమాచారం పంపడమే ఆలస్యం ఈ డ్రోన్లు తమ పని ప్రారంభిస్తాయి. దూరాన్ని బట్టి సాధ్యమైనంత త్వరలో నిర్దేశిత ప్రాంతంలో సామగ్రిని వదిలేస్తుంది. ప్యారాచూట్ సాయంతో సామగ్రి ఉన్న బ్యాగ్‌ను భద్రంగా కిందికి దించుతుంది.

మరిన్ని వార్తలు