పాపం.. పసివాడు

30 May, 2016 20:26 IST|Sakshi
పాపం.. పసివాడు

పొట్టకూటి కోసం దేశం విడిచి, ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని యూరప్కు శరణార్థులుగా వెళ్లే ఆఫ్రికా దేశాల ప్రజలకు మధ్యధరా సముద్రం ఓ మృత్యుకూపం వంటిది. సురక్షితం కాని పడవల్లో, విధిలేని పరిస్థితుల్లో సామర్థ్యానికి మించి పడవల్లో ప్రయాణిస్తూ మధ్యధరా సముద్రంలో ప్రమాదంలో చిక్కుకుని వేలాదిమంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. గతవారం మధ్యధరా సముద్రంలో పడవ మునిగిపోవడంతో భారీగా ప్రాణనష్టం సంభవించింది. గల్లంతయిన వారి ఆచూకీ కనుగొనేందుకు రంగంలోకి దిగిన జర్మనీ సహాయక బృందం లిబియా తీరంలో గత శుక్రవారం ఓ చిన్నారి మృతదేహాన్ని వెలికితీసింది.

పాపం.. ఆ చిన్నారి వయసు ఏడాది కంటే కాస్త ఎక్కువగా ఉంటుంది. ముద్దుగా, బొద్దుగా కనిపిస్తున్న ఆ చిన్నారి నిద్రపోతున్నట్టుగా ఉంది. సముద్రంలో పడవపై జర్మన్ సహాయక బృందం సభ్యుడు ఎత్తుకున్న ఈ చిన్నారి మృతదేహం ఫొటో విదారకంగా ఉంది. ఆఫ్రికా దేశాల నుంచి తరలివచ్చే శరణార్థుల భద్రత కోసం తగిన చర్యలు తీసుకునేలా, వారి దయనీయ స్థితిని యూరప్ దేశాల దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశ్యంతో ఈ ఫొటోను విడుదల చేశారు. జర్మనీకి చెందిన మానవతావాద సంస్థ సీ వాచ్ ఓ మీడియా ప్రొడక్షన్ కంపెనీ ద్వారా ఈ ఫొటోలను పంపిణీ చేసింది.

సముద్రం నీళ్లలో ఓ బొమ్మలాగా ఈ చిన్నారి శరీరం కనిపించిందని సహాయక బృందం సభ్యుడు వెల్లడించాడు. చిన్నారి ప్రాణాలతో ఉంటుందనే ఆశతో చేతుల్లోకి తీసుకుని గాలి, సూర్యరశ్మి తగిలేలా ఉంచానని, అయితే శాశ్వతంగా కళ్లు మూసిందని ఆవేదన వ్యక్తం చేశాడు. కాగా ఈ చిన్నారి తల్లిదండ్రులు ఎవరన్న విషయం తెలియరాలేదు. ఈ మృతదేహాన్ని ఇటలీ నేవీ సిబ్బందికి అప్పగించారు. మరణించిన చిన్నారి పాప లేక బాలుడా అన్న విషయాన్ని వెల్లడించలేదు. సహాయక బృందాలు మరో 25 మృతదేహాలను వెలికితీసి ఇటలీ నేవీ సిబ్బందికి అప్పగించారు. ఇటలీ నేవీ సిబ్బంది మొత్తం 45 మృతదేహాలను రెగీయో కాలబ్రియా రేవుకు తరలించింది.

గతేడాది సిరియా నుంచి శరణార్థులుగా యూరప్కు వలస వెళ్తూ సముద్రంలో పడవ మునిగిపోవడంతో మూడేళ్ల బాలుడు ఆయ్లాన్ ప్రాణాలు కోల్పోయి.. ఆ బాలుడి మృతదేహం టర్కీ బీచ్కు కొట్టుకువచ్చిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఆ ఫొటో ప్రపంచాన్ని కలచివేసింది. లక్షలాది మంది ప్రజల హృదయాలను కదిలించింది.  2014 నుంచి మధ్యధరా సముద్రంలో 8 వేలమందికిపైగా శరణార్థులు ప్రాణాలు కోల్పోయారు.
 

మరిన్ని వార్తలు