మత్తు బాబులు; ఆ విమానంలో అన్నీ కష్టాలే..!

22 Oct, 2019 21:29 IST|Sakshi

న్యూఢిల్లీ : విమానాల్లో బిత్తిరి చర్యలు మనం చాలానే వినుంటాం. ఇప్పుడు మనం తెలుసుకోబోయేది కూడా అలాంటి ఓ బిత్తిరి చర్య గురించే. కానీ, ఇది విమానం మొత్తాన్ని గంగలో కలిపే చర్య. ఫూటుగా మద్యం సేవించిన ఓ వ్యక్తి  వేల అడుగుల ఎత్తులో వెళ్తున్న ఓ విమానం డోర్‌ను తెరిచేందుకు యత్నించాడు. దీంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటన నార్డ్‌విండ్‌ విమానంలో జరిగింది. అందులోనే ప్రయాణిస్తున్న టీవీ రిపోర్టర్‌ ఎలీనా దెమిదోవా ఈ వీరంగాన్ని మొబైల్‌లో బంధించింది. తన భయానక అనుభవాల్ని చెప్పుకొచ్చింది. ఆమె తెలిపిన వివరాలు.. నార్డ్‌విండ్‌ విమానం మాస్కో నుంచి థాయ్‌లాండ్‌లోని ఫకెట్‌ ప్రాంతానికి వెళ్తోంది. 

ఈ క్రమంలో సోయిలేకుండా మత్తులో మునిగిన ఓ వ్యక్తి విమానం డోర్‌ను ఓపెన్‌ చేసేందుకు యత్నించాడు. అప్పుడు ఫ్లైట్‌ సరిగ్గా 33 వేల అడుగుల ఎత్తులో ఉంది. తాగుబోతును సముదాయించేందుకు ఓ డాక్టర్‌ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దగ్గరికి వెళ్లినవారిని అతను తోసేస్తున్నాడు. ఇష్టం వచ్చినట్టు తిడుతున్నాడు. దీంతో ధైర్యం చేసిన ఓ ఏడుగురు ప్రయాణికులు అతన్ని ప్లాస్టిక్‌ వైరుతో కట్టి బంధించారు. ఇక తాగుబోతును కట్టడి చేస్తున్న క్రమంలో క్రూ సిబ్బంది ప్రయాణికులకు ఓ అనౌన్స్‌మెంట్‌ ఇచ్చారు. ‘ఓ తాగుబోతు పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడు. అతన్ని కట్టడి చేసేందుకు యత్నిస్తున్నాం. విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్‌ చేయాల్సి రావొచ్చు. సీట్‌ బెల్ట్‌ ధరించండి’ అని ప్రకటించారు.

విమానం తాష్కెంట్‌ (ఉజ్బెకిస్తాన్‌)లో ల్యాండ్‌ అయిన అనంతరం తాగుబోతును పోలీసులకు అప్పగించారు.  విమానం మళ్లీ బయల్దేరింది. అయితే, ఇక్కడితో ఆ విమానంలోని ప్రయాణికుల కష్టాలు తీరలేదు. అదే విమానంలో ప్రయాణిస్తున్న మరో ఇద్దరు వ్యక్తులు.. మద్యం మత్తులో గొడవకు దిగారు. మరో వ్యక్తి టాయ్‌లెట్‌లో సిగరెట్‌ తాగాడు. థాయ్‌లాండ్‌ చేరుకున్నాక ఈ ముగ్గురినీ పోలీసులు అరెస్టు చేశారు.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా