ఔదార్యం: నేరస్తుల్లో అలాంటి వాళ్లే ఎక్కువ! 

16 Oct, 2019 09:25 IST|Sakshi

అబుదాబి : దుబాయ్‌ జైళ్లలో శిక్ష అనుభవించి...మాతృదేశానికి వెళ్లడానికి డబ్బులు లేక అవస్థలు పడుతున్న కార్మికులను భారత్‌కు చెందిన వ్యాపారి జోగీందర్‌ సింగ్‌ సలారియా ఆదుకున్నారు. 1993 నుంచి దుబాయ్‌ కేంద్రంగా వ్యాపారాన్ని విస్తరించిన జోగీందర్‌ ప్రస్తుతం పెహల్‌ ఇంటర్నేషనల్‌ ట్రాన్స్‌పోర్టు ఎండీగా ఉన్నారు. ఈ సంస్థకు సంబంధించిన చారిటబుల్‌ ట్రస్టు తరఫున పలువురు ఖైదీలు సొంత దేశాలకు వెళ్లేందుకు జోగీందర్‌ విమాన టిక్కెట్లు కొనుగోలు చేశారు. తద్వారా పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌, చైనా, అఫ్గనిస్తాన్‌, ఉగాండా, నైజీరియా, ఇథియోపియా తదితర దేశాలకు చెందిన 13 మంది ఖైదీలు తమ స్వదేశాలకు వెళ్లే వీలు కలిగిందని ఖలీజ్‌ టైమ్స్‌ పేర్కొంది.

కాగా ఈ విషయం గురించి జోగీందర్‌ మాట్లాడుతూ... చిన్న చిన్న నేరాలకు పాల్పడి.. జైలులో శిక్ష అనుభవించి... సొంత దేశానికి వెళ్లేందుకు డబ్బులు లేని వ్యక్తులకు తమ ట్రస్టు సహాయం చేస్తుందని తెలిపారు. జైలు నుంచి విడుదలై ఆర్థిక సహాయం కోసం ఎదురుచూస్తున్న వారి జాబితాను దుబాయ్‌ పోలీసు శాఖ ట్రస్టుకు పంపిస్తుందని పేర్కొన్నారు. ‘ మేము చేసిన చిన్న సహాయం ద్వారా ఎంతోమంది నిస్సహాయులు తమ కుటుంబాలను చేరుకుంటారు. నిజానికి దుబాయ్‌కు వచ్చే చాలా మంది కార్మికులు.. వీసా గడువు ముగిసిన తర్వాత కూడా ఇక్కడే ఉండటం, తోటి కార్మికులతో తగాదాలు పెట్టుకోవడం వంటి నేరాల్లో ఇరుక్కుంటున్నారు. జైలు నుంచి విడుదలైన తర్వాత ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తూ కాలం వెళ్లదీస్తున్నారు. అలాంటి వారిని ఆదుకోవడం కోసం దుబాయ్‌ పోలీసు శాఖతో కలిసి పెహల్‌ చారిటబుల్‌ ట్రస్టు పనిచేస్తోంది. పోలీసులు ఇచ్చిన జాబితా ఆధారంగా మేము విమాన టికెట్లు కొనుగోలు చేస్తాం’ అని జోగీందర్‌ తెలిపారు.
 

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా