దుబాయ్ చరిత్రలోనే తొలిసారి..

6 Nov, 2018 16:12 IST|Sakshi

దుబాయ్‌ : ఎడారి దేశంలో తొలిసారి.. దివ్వేల పండుగ జరుగుతుంది. అది కూడా ఏకంగా పది రోజులు. అవును.. దుబాయ్ ప్రభుత్వం తొలిసారి తమ దేశంలో దీపావళి ఉత్సవాలు నిర్వహిస్తోంది. కాన్సులేట్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియాతో కలిసి దాదాపు పది రోజుల పాటు ఈ వేడుకలను నిర్వహించనున్నట్లు దుబాయ్ అధికారులు తెలిపారు. నవంబర్‌ 1న మొదలైన ఈ వేడుకలు ఈ నెల 10 వరకూ కొనసాగుతాయన్నారు.

వేడుకల్లో భాగంగా పది రోజులపాటు వేర్వేరు కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. బాలీవుడ్‌కు చెందిన ప్రముఖుల చేత ఎంటర్‌టైన్‌మెంట్‌ కార్యక్రమాలు.. భంగ్రా ప్రదర్శనలతో పాటు దీపావళి సందర్భంగా దీపాల ప్రదర్శనే కాక ఫైర్‌క్రాకర్స్‌ షోని కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

దీపావళి వేడుకల సందర్భంగా దుబాయ్‌ అధికారులు మరో అరుదైన రికార్డ్‌ కోసం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఎక్కువ మంది చేత ఒకేసారి ఎల్‌ఈడీ దీపాలను వెలిగించి.. గిన్నిస్‌ రికార్డ్‌ సృష్టించాలని దుబాయ్‌ ప్రభుత్వం భావిస్తోన్నట్లు తెలిస్తోంది. ఇవన్ని ఒక ఎత్తయితే.. దీపావళి వేడుకలకే హైలెట్‌గా నిలిచిన సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఏంటంటే దీపావళి వేడుకల్లో భాగంగా దుబాయ్‌లో మన జాతీయ పతాకాన్ని ప్రదర్శించడమే కాకుండా.. దుబాయి పోలీస్‌ బ్యాండ్‌ మన జాతీయ గీతాన్ని గిటార్‌ మీద ప్లే చేశారు.

అంతేకాక దుబాయ్‌ ఎయిర్‌లైన్‌ ఎమిరేట్స్‌ కూడా దివాళి వేడుకల్లో పాలుపంచుకుంది. ఈ సందర్భంగా ప్రయాణికులకు భారతీయ సాంప్రదాయ మిఠాయిలను, చిరుతిళ్లను అందిస్తోంది.

మరిన్ని వార్తలు