తెలంగాణ వాసికి భారీ ఊరట..1.5 కోట్ల బిల్లు మాఫీ!

16 Jul, 2020 15:26 IST|Sakshi

సాధారణ సమయాల్లోనే చిన్న చిన్న జబ్బులకు సైతం వేల కొద్ది రూపాయల బిల్లు వసూలు చేసే ఆస్పత్రులను మనం చూస్తూనే ఉంటాం. ఇక కరోనా కాలంలో పరిస్థితి ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలాంటిది ఓ ఆస్పత్రి యాజమాన్యం కోవిడ్‌ పేషెంట్‌ చికిత్స కోసం ఖర్చు అయిన భారీ మొత్తం... అక్షరాలా కోటిన్నర రూపాయల బిల్లును మాఫీ చేసి ఆదర్శప్రాయంగా నిలిచింది. ఉపాధి కోసం తమ దేశానికి వచ్చిన తెలంగాణ వాసికి ఊరట కల్పించింది. ఈ ఘటన దుబాయ్‌లో చోటుచేసుకుంది. 

హైదరాబాద్‌: ఉపాధి కోసం దుబాయ్‌ బాట పట్టిన జగిత్యాల వాసికి మహమ్మారి కరోనా సోకింది. పనిచేస్తే గానీ నాలుగు రాళ్లు సంపాదించలేని స్థితిలో ప్రాణాంతక వైరస్‌ బారి నుంచి ఎలా బయటపడాలో తెలియక కొట్టుమిట్టాడుతున్న సమయంలో.. గల్ఫ్‌ కార్మికుల పరిరక్షణ సొసైటీ అధ్యక్షుడు, సామాజిక కార్యకర్త గుండెల్లి నరసింహ ముందుకు వచ్చారు. చొరవ తీసుకుని కోవిడ్‌ బాధితుడిని ఆల్‌ ఖలీజ్‌ రోడ్డులోని దుబాయ్‌ ఆస్పత్రిలో చేర్చారు.

అనంతరం ఈ విషయాన్ని దుబాయ్‌లోని ఇండియన్‌ కాన్సులేట్‌ వాలంటీర్‌ సుమంత్‌రెడ్డి దృష్టికి వెళ్లారు. బాధితుడికి ఆస్పత్రి బిల్లు కట్టే స్థోమత లేదని చెప్పడంతో సుమంత్‌రెడ్డి ఓ ట్రస్టుతో విషయం గురించి చర్చించి.. కన్సుల్‌(లేబర్‌) ఆఫ్‌ ఇండియన్‌ కాన్సులేట్‌ హర్జీత్‌ సింగ్‌ దృష్టికి తీసుకువెళ్లారు. ఇందుకు స్పందించిన హర్జీత్‌ దుబాయ్‌ ఆస్పత్రి యాజమన్యానికి లేఖ రాయడంతో సానుకూల స్పందన వచ్చింది. దాదాపు రెండున్నర నెలలకు పైగా కరోనా పేషెంట్‌కు చికిత్స అందించిన ఆస్పత్రి 7,62,555 దీరాంలు(మన కరెన్సీలో సుమారు రూ. 1.52 కోట్లు) బిల్లును మాఫీ చేసింది. కరోనా నుంచి కోలుకున్న అనంతరం బాధితుడిని డిశ్చార్జ్‌ చేసింది. (‘కరోనా నుంచి దేవుడే మనల్ని కాపాడాలి’)

ఈ నేపథ్యంలో జగిత్యాల వాసితో పాటు అతడి అటెండెంట్‌కు సైతం ఇండియా వెళ్లేందుకు దాతలు టికెట్లు బుక్‌ చేశారు. దీంతో వారిద్దరు ఎయిర్‌ ఇండియా విమానంలో మంగళవారం రాత్రి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. అక్కడి నుంచి జగిత్యాల జిల్లాలోని గొల్లపల్లి మండలంలో గల వారి స్వస్థలానికి పయనమయ్యారు. 14 రోజుల పాటు వీరిద్దరు క్వారంటైన్‌లో ఉండనున్నారు. ఈ విషయాన్ని ఇమ్మిగ్రెంట్స్‌ వెల్ఫేర్‌ ఫోరం మంద భీంరెడ్డి ఓ జాతీయ మీడియాకు వెల్లడించారు. 

మరిన్ని వార్తలు