271 కోట్లతో పారిపోయిన ప్రధాని భార్య!

1 Jul, 2019 16:25 IST|Sakshi

దుబాయ్‌: యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌(యూఈఏ) ప్రధానమంత్రి, అపర కుబేరుడు షేక్‌ మహ్మద్‌ బిన్‌ రషీద్‌ ఆల్‌ మత్కవుమ్‌ ఆరో భార్య హయా బింట్‌ ఆల్‌ హుస్సేన్‌ తన పిల్లలతో కలిసి పారిపోయారు. 31 మిలియన్ల ఫౌండ్ల నగదు(సుమారు రూ. 271 కోట్లు), తన పిల్లలు జలీల(11), జయేద్‌(7)తో కలిసి ఆమె వెళ్లిపోయినట్టు స్థానిక మీడియా వెల్లడించింది. వివాహ బంధం విచ్ఛిన్నం కావడంతో భర్తతో కలిసివుండటం ఇష్టంలేక ఆమె వెళ్లిపోయినట్టు తెలిపింది. లండన్‌లో ఆమె ఆశ్రయం పొంది ఉండొచ్చని భావిస్తున్నారు. ముందుగా జర్మనీ ఆశ్రయం కోరినప్పటికీ ఆమోదం లభించకపోవడంతో లండన్‌లో రహస్య ప్రాంతంలో ఆమె తలదాచుకున్నట్టు తెలుస్తోంది.

మహ్మద్‌ బిన్‌ రషీద్‌ కుమార్తె షేక్‌ లతిఫా కూడా గతేడాది దుబాయ్‌ నుంచి పారిపోయేందుకు విఫలయత్నం చేశారు. మితిమీరిన బంధనాల మధ్య బతకలేనంటూ తన తండ్రిని విమర్శిస్తూ పారిపోయేముందు యూట్యూబ్‌లో ఒక వీడియో పోస్ట్‌ చేశారు. లతిఫాకు సాయం చేసినందుకు అప్పట్లో హయా విమర్శలు ఎదుర్కొన్నారు. జోర్డాన్‌ రాజు సోదరి అయిన హయా ఆక్స్‌ఫర్డ్‌లో చదువుకున్నారు. సోషల్‌ మీడియాలో చురుగ్గా ఉండే ఆమె మే 20 తర్వాత బహిరంగంగా కనబడలేదు. తన సేవా కార్యక్రమాలకు సంబంధించిన ఫొటోలను తరచుగా పోస్ట్‌ చేసేవారు. ఫిబ్రవరి తర్వాత సోషల్‌ మీడియాలో పోస్ట్‌లు పెట్టలేదు.

తనను వదిలిపెట్టి భార్య వెళ్లిపోవడంపై మహ్మద్‌ బిన్‌ రషీద్ తీవ్రంగా స్పందించారు. ఆమె వైఖరిని తప్పుబడుతూ అరబిక్‌లో కవిత రాసి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. తన నమ్మకాన్ని వమ్ము చేసి మోసం చేసిందని.. ఆమె బతికున్నా చనిపోయినా తనకు అనవసరమని పేర్కొన్నారు. హయా వ్యవహారంపై స్పందించేందుకు బ్రిటీషు, యూఏఈ ప్రభుత్వాలు నిరాకరించాయి.

మరిన్ని వార్తలు