జాతి వైరాన్నిమరచి...

4 Dec, 2015 19:05 IST|Sakshi

పగలూ, ప్రతీకారాలు మరచిపోయాయి. రెండు విభిన్న జాతులమన్న ఆలోచననూ కనీసం ఆ దరిదాపులకు రానివ్వలేదు. ఓ కుక్కపిల్లా, బాతు కలసి మెలసి ఆనందంగా ఆడుతున్నాయి. స్నేహబంధానికి ఎటువంటి హద్దులూ ఉండవని నిరూపిస్తున్నాయి.  జాతి వైరాన్ని మరచి  చూపరులకు కనువిందు చేసిన ఆ  వీడియో ఇప్పుడు అందర్నీ ఆకట్టుకుంటోంది.

ఆకారంలోనూ, జాతుల్లోనూ ఏమాత్రం పోలిక లేకపోయినా... కక్షలూ, కార్పణ్యాలకు దూరంగా ఒకేచోట బతుకుతున్న ఆ జంతువులు.. కల్మషంతో కుళ్ళుకునే మనుషులకు కనువిప్పు చేస్తున్నాయి. పక్షుల్ని చూస్తే పీక పట్టుకునే కుక్క... కుక్కను చూడగానే ముక్కు పెట్టి పొడిచేందుకు తయారయ్యే బాతూ... ఇక్కడ మాత్రం ఒకదానికొకటి మంచి స్నేహితులుగా కనిపిస్తూ...చూపరులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. చాలా సీరియస్ గా కొట్టుకుంటున్నా దెబ్బలు తగలని ఈ దృశ్యం.. ఓ రెజ్లింగ్ క్రీడను తలపిస్తోంది.

ఒకదాన్నొకటి కొరుకుతూ..ముందుకు నెడుతూ వాటి బలాబలాలను పరీక్షించుకుంటున్నాయి. ఏది ఏమైనా సరదాకు, ఆగ్రహానికి మధ్య ఉన్న చిన్నపాటి గీతను దాటకుండా సంయమనం పాటిస్తూ ఆటలాడుతున్న ఆ జంతువుల వీడియో...  స్నేహ బంధాన్ని మరోసారి రుజువు చేస్తోంది. యజమాని తోటలో జతగా బలపరీక్షకు దిగిన ఈ పెంపుడు జంతువులు...ఎటువంటి హాని కలగకుండా సున్నితంగా ఆడుకోవడం వాటిలోని ఆలోచనా శక్తిని ప్రస్ఫుటిస్తుంది.

>
మరిన్ని వార్తలు