అక్కడ మరోసారి భయానక వాతావరణం

21 Jan, 2020 12:54 IST|Sakshi

కాన్‌బెర్రా : ఆస్ట్రేలియాలో మొన్నటిదాకా ప్రజలు కార్చిచ్చుతో అతలాకుతులం అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడిప్పుడే దాని నుంచి కోలుకుంటున్న అక్కడి ప్రజల్లో వరుస తుఫాన్లు, సుడిగాలులు మరోసారి భయానక వాతావరణం సృష్టిస్తున్నాయి. తాజాగా సోమవారం ఆస్ట్రేలియా రాజధాని కాన్‌బెర్రాలో సుడిగాల్పులు బీభత్సంతో తీవ్ర కలకలం రేగింది. గంట​కు 107 మైళ్ల వేగంతో  వీచిన గాలులకు ప్రజా భవనాలు, గృహాలు, కార్లు ద్వంసమవడంతో పాటు వేలాది చెట్లు నేలకొరిగాయి. రాజధానిలోని  చాలా ప్రాంతాల్లో పవర్‌ కట్‌ అవడంతో అత్యవసర సేవలకు అంతరాయం ఏర్పడింది.

బ్రిస్బేన్‌, క్వీన్స్‌లాండ్‌లోని గోల్డ్‌కోస్ట్‌ ప్రాంతాలలో శనివారం వడగళ్ల వాన చుట్టముట్టడంతో చాలా ప్రాంతాలు నీటిలో మునిగిపోయాయి. ఇలా ఆస్ట్రేలియాలో ఒకదాని తర్వాత మరొకటి చోటుచేసుకుంటుండడంతో అక్కడి ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా పోతుంది. రెండు నెలల క్రితం న్యూసౌత్‌ వేల్స్‌ అడవుల్లో మొదలైన కార్చిచ్చును చల్లార్చాడానికి ఈ అకాల వర్షాలు మంచివే అయినా ఆస్ట్రేలియాలోని రెండు ప్రధాన నగరాల్లోని ప్రజలకు మాత్రం పెద్ద ఎత్తున ఆస్తి నష్టం కలిగించిందనే చెప్పుకోవాలి. అయితే కార్చిచ్చు దాటికి 28 మంది మరణించగా, వేలాది జంతువులు మృత్యువాత పడ్డాయి. కార్చిచ్చు దాటికి 10.4 మిలియన్‌ హెక్టార్లు కాలిపోయింది. కార్చిచ్చుకు హరించుకుపోయిన ఈ మొత్తం యూఎస్‌ఏలోని ఇండియానా  రాష్ట్రంతో సమానం కావడం విశేషం.

మరిన్ని వార్తలు