వయసు తగ్గించమని కోర్టుకెక్కాడు! 

11 Nov, 2018 02:45 IST|Sakshi

తన వయసు వల్ల వివక్షకు గురవుతున్నానని, ఇందుకు తన వయసును 20 ఏళ్లు తగ్గించాలంటూ ఎమిలే రాటిల్‌బాండ్‌ (69) అనే డచ్‌ పౌరుడు కోర్టు మెట్లెక్కాడు. ఇందుకు ఆయనకు వచ్చే ఓల్డేజ్‌ పెన్షన్‌ సైతం వదులుకున్నాడు. ‘నా వయసు 69 అయినా నేను కొత్త ఇల్లు కొనగలను. కుర్రవాడిలా వేగంగా కారు నడపగలను. 49 ఏళ్ల వయసప్పుడు నా ముఖం ఎలా ఉందో ఇప్పుడూ అలాగే ఉంది. నా ఆస్తి అంతస్థులూ, స్థితిగతులు మారనప్పుడు నా వయసు మారడమేంటో అర్థం కావడం లేదు’ అంటూ రాటిల్‌ బాండ్‌ కోర్టుకు వివరించాడు. తాను ముసలాడినని, పెన్షనర్‌నని కంపెనీలు ఉద్యోగంలో చేర్చుకోకుండా వివక్ష చూపిస్తున్నాయని ఫిర్యాదు కూడా చేశాడు.

అందరూ పదే పదే తన వయసును గుర్తు చేయడం వల్ల జీవితంలో అనుకున్న లక్ష్యాలను సాధించలేకపోతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశాడు. తొలుత ట్రాన్స్‌జెండర్‌గా మారడానికి సైతం కోర్టులు ఒప్పుకోలేదని అనంతర పరిణామాలతో ఒప్పుకోక తప్పలేదని.. ఇదీ అంతేనంటూ జడ్జికి గుర్తు చేసి ఒప్పించే ప్రయత్నం చేశాడు. పేర్లను మార్చుకోవడానికి ఒప్పుకున్నప్పుడు 1949 మార్చి 11గా ఉన్న పుట్టిన తేదీని1969 మార్చి 11గా మారిస్తే ఏమవుతుందని ప్రశ్నించాడు తనకు తాను ‘యంగ్‌ గాడ్‌’గా ప్రకటించుకున్న రాటిల్‌బాండ్‌. అతని వాదన విన్న కోర్టు విచారణ వాయిదా వేసింది. నాలుగు వారాల్లో ఈ వ్యాజ్యంపై తీర్పు వచ్చే అవకాశం ఉంది. 

మరిన్ని వార్తలు