ఆ బాధను భరించలేకపోతున్నా!

5 Jun, 2019 09:08 IST|Sakshi
నోవా పోథోవెన్

‘చాలా ఏళ్లుగా పోరాడుతూనే ఉన్నా.. ఇప్పుడు ఆ పోరాటం ముగిసింది. ఇక నా వల్ల కాదు. ఈ బాధను నేను భరించలేకపోతున్నా. చాలా సంభాషణలు.. సమీక్షల అనంతరం నేను ఈ లోకం వీడాలనే నిర్ణయానికి వచ్చా.. తినడం, తాగడం మానేసాను. వాస్తవానికి నేను ఎప్పుడో చనిపోయాను. ప్రస్తుతానికి నేను గాలి పీల్చుకుంటున్నా.. అది బతకడానికి కాదు. నా కుటుంబం నన్ను చాలా జాగ్రత్తగా చూసుకుంది. రోజంతా నా కుటుంబంతో గడిపితే నా బాధ నుంచి ఉపశమనం కలిగేది. నా జీవితంలో ముఖ్యమైన వారందరికి గుడ్‌బై. ఇక సెలవు’ అంటూ ఓ 17 ఏళ్ల టీనేజర్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన పోస్ట్‌. ప్రస్తుతం ఈ పోస్ట్‌ నెదర్లాండ్స్‌లో ఉన్న చట్టాలపై చర్చకు తెరలేపింది. సోషల్‌ మీడియా వేదికగా తీవ్ర చర్చ జరుగుతోంది.  

‘ఇది చాలా విచారకరమైన విషయం. ఓ యంగ్‌ డచ్‌ గర్ల్‌ 17 ఏళ్ల వయసులోనే కారుణ్య మరణం పొందడం ఏంటి. ఆమె తన డిప్రెషన్‌ను హ్యాండిల్‌ చేయలేకపోయింది. అయినా డచ్‌ ప్రభుత్వం ఎలా అనుమతిచ్చింది. కనీసం ఆమె మేజర్‌ అయ్యేంత వరకైనా వేచి చూడాల్సింది. ఆ అమ్మాయి మరణంతో మా గుండె పగిలింది.’ అంటూ ఆ దేశ నెటిజన్లు సోషల్‌ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

విషయం ఏంటంటే..  
పసితనంలో తన తనువుపై మృగాళ్లు చేసిన గాయం.. ఆ టీనేజర్‌ను తీవ్ర డిప్రేషన్‌లో నెట్టేసింది. కోలుకోవడానికి ఎంత ప్రయత్నించినా ఆమె వల్ల కాలేదు. చివరకు ఈ భూమి మీద ఉండలేనంటూ కారుణ్య మరణం పొందింది. నెదర్లాండ్స్‌కు చెందిన నోవా పోథోవెన్ చిన్నతనంలో జరిగిన అత్యాచారం నుంచి కోలుకోలేకపోయింది. ఆ ఘటనతో కొన్నేళ్లుగా తీవ్రమానసిక వ్యధను అనుభవించింది. చివరకు తనవల్ల కాదని ప్రభుత్వ అనుమతితో కారుణ్యమరణం పొందింది. ఇక నెదర్లాండ్స్‌లో కారుణ్య మరణం చట్టబద్ధమన్న విషయం తెలిసిందే. అయితే నోవా మరణంతో ఈ చట్టాన్ని సవరించాలని అక్కడి ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లల విషయంలో పునరాలోచించాలని కోరుతున్నారు. ఇక నోవా తన జీవితాన్ని ‘విన్నింగ్‌ ఆర్‌ లర్నింగ్‌’  పుస్తకంగా మలిచింది.

మరిన్ని వార్తలు