క్యాన్సర్‌ వస్తే పదవీ విరమణ చేస్తా

5 Oct, 2018 13:32 IST|Sakshi
ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో డ్యుటెర్టె (ఫైల్‌ ఫోటో)

మనీలా: ఫిలిప్పీన్స్ దేశ అధ్యక్షుడు రోడ్రిగో డ్యుటెర్టె (73)మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.  తను అనారోగ్యంతో బాధపడుతున్నాననీ,  అది తీవ్రమైతే  పదవీ విరమణకు  సిద్ధంగా ఉన్నానంటూ అనూహ్య ప్రకటన చేశారు.  ‘నా ఆరోగ్య పరిస్థితి ఏమిటో  ఇంకా స్పష్టంగా తెలియదు. వైద్య పరీక్షల ఫలితాలకోసం ఎదురు చూస్తున్నాను. ఒక వేళ   క్యాన్సర్ లాంటి తీవ్ర అనారోగ్యం  పాలయితే.. అదీ  థర్డ్‌ స్టేజ్‌లో ఉండి, ఇక నివారణ అసాధ్యం  అని  తేలితే’ అధ్యక్ష పదవిని వీడడానికి సిద్ధంగా ఉన్నానని  ఆయన  ప్రకటించారు. మిలిటరీ అకాడమీ గ్రాడ్యుయేట్లుతో  ప్రసంగిస్తూ గురువారం రోడ్రిగో ఈ వ్యాఖ్యలు చేశారు.


దేశంలో డ్రగ్ మాఫియాపై ప్రత్యక్ష యుద్దం ప్రకటించిన రొడ్రిగో అధికారాన్ని 2016లో చేపట్టినప్పటి నుంచి లక్షలాదిమందిని హతమార్చి  ఆధునిక హిట్లర్‌గా విమర్శలు పాలయ్యాడు.  మద్యపానం,  ధూమపానం సంబంధిత  వ్యాధులతో బాధపడుతున్న ఆయనకు ఇప్పటికే ఎండోస్కోపీ,  కోలొనోస్కోపీ పరీక్షలు జరిగాయి. మరిన్ని పరీక్షలకు వైద్యులు  సూచించినట్టు సమాచారం. మరోవైపు అధ్యక్షుడిగా రోడ్రిగో ఆరేళ్ల పదవీ కాలం 2022తో ముగియనుంది.  కాగా  సభావేదికపై దేశాధ్యక్షుడు రోడ్రిగో ఇటీవల  ఓ మహిళకు బహిరంగంగా ముద్దుపెట్టడం తీవ్ర విమర్శలకు దారితీసిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు