భూమిపై జీవం.. చెరువులే మూలం

15 Apr, 2019 04:59 IST|Sakshi

సముద్రాలతో పోలిస్తే చెరువుల్లోనే నైట్రోజన్‌ ఆక్సైడ్లు అధికం

మిట్‌ పరిశోధకుల తాజా అధ్యయనం

బోస్టన్‌: విశాల విశ్వం.. నక్షత్రాలు.. గ్రహాలు.. కోటానుకోట్ల జీవరాశులు. కంటికి కనిపించేవి కొన్నే.. కనిపించనివి అనంతం. విశ్వం ఎప్పుడు ఆవిర్భవించిందో తెలియదు.. జీవరాశి పుట్టుక వివరాలు తెలియవు. వీటికి సంబంధించిన అన్ని విషయాలూ రహస్యాలే. ఈ రహస్యాలన్నింటిని ఛేదించేందుకు ఏళ్లుగా శాస్త్రవేత్తల పరిశోధనలు.. అయినా అంతంత మాత్రమే ఫలితాలు. తాజాగా జీవ రాశి పుట్టుకకు సంబంధించిన ఆసక్తికర విషయాలు ఓ అధ్యయనంలో వెలువడ్డాయి. భూమిపై జీవరాశి పుట్టుకకు చెరువులు ముఖ్యపాత్ర పోషించాయని అమెరికాలోకి మసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(మిట్‌) నిర్వహించిన ఈ అధ్యయనంలో తేలింది. పెద్ద పెద్ద సముద్రాల కంటే కూడా చెరువులే జీవరాశికి అనువైన వాతావరణాన్ని భూమిపై సృష్టించాయని తెలిపింది. అది కూడా 10 సెంటీమీటర్లకు అటూఇటుగా ఉండే చెరువులే జీవానికి ఊపిరి పోశాయని పేర్కొంది.

చెరువులే ఎందుకు..
భూమిపై జీవం పుట్టుకకు అవసరమైన వాటిల్లో అధిక సాంద్రత గల నైట్రోజన్‌ ప్రముఖ పాత్ర పోషిస్తుందని ఎక్కువ మంది శాస్త్రవేత్తలు భావిస్తారు. నైట్రోజన్‌ ఆక్సైడ్లు సముద్రాలు, చెరువుల్లో నిక్షిప్తమై ఉంటాయి. ఇవి వాతావరణంలోని ఇతర మిశ్రమాలతో కలసి జీవం పుట్టుకకు బాటలు వేస్తుందని చెబుతారు. అయితే ఈ పరిశోధనలో పాలుపంచుకున్న మిట్‌కు చెందిన పరిధకులు సుక్రిత్‌ రంజన్‌ మాట్లాడుతూ..‘లోతైన సముద్రాల్లో ఉండే నైట్రోజన్‌ వల్లే జీవం ఉద్భవించి ఉంటుందని అనుకోవడం సరికాదు. ఎందుకంటే లోతైన సముద్రాల్లోని నైట్రోజన్‌.. వాతావరణంలోని ఇతర మిశ్రమాలతో ప్రతిచర్య జరిపే అవకాశాలు చాలా తక్కువ. అలాగే అతి నీలలోహిత కిరణాలు, సముద్రాల్లోని ఐరన్‌ ధాతువులు నైట్రోజన్‌ మిశ్రమాన్ని అధిక శాతంలో నాశనం చేసే అవకాశం ఉంది.

అనంతరం మిగిలిన కొద్ది మొత్తంలోని నైట్రోజన్‌ను వాయువు రూపంలో తిరిగి వాతావరణంలోకి పంపించేస్తాయి. దీంతో సముద్రాల్లో నైట్రోజన్‌ జీవం పుట్టుకకు ఎంతమాత్రం దోహదపడే అవకాశం లేదు. మరోవైపు చెరువుల్లోని నైట్రోజన్‌ ఆక్సైడ్ల వల్లే భూమిపై జీవం ఆవిర్భవించే అవకాశాలు అత్యధికం. చెరువుల్లో నైట్రోజన్‌ ఆక్సైడ్ల రూపంలో నిక్షిప్తమైన నైట్రోజన్‌ మిశ్రమం వాతావరణంలోని ఇతర మిశ్రమాలతో ప్రతిచర్య జరిపే అవకాశాలు అధికంగా ఉంటాయి. అలాగే చెరువుల్లో మిశ్రమాలు కరిగే అవకాశాలు చాలా తక్కువ. మొత్తంగా చూస్తే.. శాస్త్రవేత్తలు భావిస్తున్నట్లుగా జీవం పుట్టుకకు నైట్రోజన్‌ అవసరమై.. అదీ సముద్రాల్లోనిదే అయ్యిండాలంటే మాత్రం భూమిపై జీవం పుట్టుక అనేది దాదాపు అసాధ్యం. చెరువుల్లో ఉండే నైట్రోజన్‌తో మాత్రమే భూమిపై జీవం ఆవిర్భవించి ఉండేందుకు అవకాశాలు మెండుగా ఉన్నాయి’అని ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు.  

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా