ఏడు చోట్ల వ్యతిరేకం, ఒకచోట ఓకే....

19 Sep, 2014 09:44 IST|Sakshi
ఏడు చోట్ల వ్యతిరేకం, ఒకచోట ఓకే....

గ్లాస్గో : స్కాంట్లాండ్లో రెఫరెండం కౌంటింగ్ కొనసాగుతోంది.  యూకే నుంచి విడిపోయి స్వతంత్ర దేశంగా ఏర్పడే అంశంపై 32 జిల్లాల్లో ఈ రిఫరెండం జరుగుతోంది. ఇప్పటివరకూ ఏడు జిల్లాల్లో తమకు స్వాతంత్ర్యం వద్దంటూ ఫలితాలు రాగా, ఒక్క జిల్లాలో మాత్రం అనుకూలంగా ఫలితం వెలువడింది. ప్రపంచవ్యాప్తంగా  ఆసక్తి రేపిన స్కాట్లాండ్ రెఫరెండంపై ఫలితాలు మరికొద్ది గంటల్లో వెలువడనున్నాయి.


కాగా కలిసుండేందుకే మొగ్గు: అతి స్వల్ప మెజారిటీతో బ్రిటన్‌తో కలిసుండాలనే వాదనే విజయం సాధిస్తుందని తాజా సర్వేలో తేలింది. 'యుగవ్' చేసిన ప్రీ ఎలక్షన్ సర్వేలో 52% మంది యూకేలో భాగంగానే ఉండాలని, 48% మంది స్వతంత్రదేశంగా ఉండాలని స్పష్టం చేశారు.

విడిపోవడం ఎందుకు?
బ్రిటన్, స్కాట్లాండ్ దేశాల మధ్య అసమానతలు, స్కాట్లాండ్‌లో 4 దశాబ్దాల కిత్రం భారీగా బయటపడిన ఆయిల్ నిల్వలు.. ఇవి స్వతంత్రత వైపు స్కాట్ ప్రజలు ఆలోచించేలా చేశాయి. ఆర్థిక, ఆరోగ్య, సంక్షేమ రంగాల్లో బ్రిటన్ ప్రభుత్వం చూపిన వివక్ష, ప్రబలిన నిరుద్యోగం.. స్కాట్ ప్రజల్లో స్వాతంత్య్ర కాంక్షను మరింత పెంచాయి. ఇరాక్, అఫ్గానిస్తాన్‌లల్లో బ్రిటన్ యుద్ధాల్లో పాల్గొనడం కూడా స్కాట్ వాసులకు ఇష్టంలేదు. అణ్వాయుధ రేసులో యూకే ఉండటాన్ని వారు వ్యతిరేకించారు.
     
యూకే చమురు ఉత్పత్తుల్లో దాదాపు 90% స్కాట్‌లాండ్ నుంచే వస్తున్నప్పటికీ.. ఆ స్థాయిలో తమకు వనరుల కేటాయింపు లేకపోవడం స్కాట్ ప్రజలను ఆలోచింపజేసింది. చమురు నిల్వలు, ఇతర సహజ వనరులతో స్వతంత్రదేశంగా మరింత అభివృద్ధిని సాధించగలమని సాల్మండ్ వంటి నేతలు వివరిస్తుండటంతో వారిలో ఆశలు చిగురించాయి.
 
కలసి సాగడం ఎందుకు?


విడిపోతే ఎదురుకానున్న కష్టనష్టాలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు బ్రిటన్ అనుకూల వర్గాలు ప్రయత్నిస్తున్నాయి.ఇప్పటికే ఇబ్బందుల్లో ఉన్న ఆర్థిక వ్యవస్థ మరింత కుదేలవుతుందని, అది మొత్తంగా యూరోప్‌పై ప్రతికూల ప్రభావం చూపుతుందని వారు వివరిస్తున్నారు. కొత్త దేశంగా ఏర్పడితే స్కాట్లాండ్ కొత్త కరెన్సీకి ఎదురయ్యే కష్టాలనూ ప్రస్తావిస్తున్నారు. చమురు నిల్వల విషయం మినహాయిస్తే.. మిగతా రంగాల్లో బ్రిటన్ సహకారం స్కాట్లాండ్‌కు అవసరమని వాదిస్తున్నారు.

మరిన్ని వార్తలు