ఉత్తర కొరియాలో భూకంపం.. మళ్లీ అణుపరీక్షలు!

14 Mar, 2016 12:09 IST|Sakshi
ఉత్తర కొరియాలో భూకంపం.. మళ్లీ అణుపరీక్షలు!

సియోల్: ఉత్తర కొరియాలో సోమవారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. ఉత్తర కొరియా వాయువ్య ప్రాంతంలోని సోంగ్లిమ్ పట్టణ సమీపంలో రెక్టర్ స్కేలుపై 3.1 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు దక్షిణ కొరియా వాతావరణ సంస్థ ప్రకటించింది. అయితే ఈ భూకంపం అణుపరీక్షల కారణంగా సంభవించినట్లు ఎలాంటి సంకేతాలు లేవని ఆ సంస్థ తెలిపింది.  ఉత్తర కొరియా అణుపరీక్షలు నిర్వహించే పుంగేరీ ప్రాంతానికి భూకంప కేంద్రం దూరంగా ఉండటంతో మళ్లీ అణుపరీక్షలు జరిగినట్లు నిర్థారించలేదు.

జనవరి 6న ఉత్తర కొరియా హైడ్రోజన్ బాంబు ప్రయోగం జరిపిన సమయంలో రెక్టర్ స్కేలుపై 5.1 తీవ్రతతో భూకంపం సంభవించి ప్రపంచ దేశాల్లో కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. కొరియా ద్వీపకల్పంలో సాధారణ స్థాయి భూకంపాలు మామూలేనని నిపుణులు చెబుతున్నప్పటికీ.. ఇటీవలి కాలంలో అణ్వాయుధ పరీక్షలతో దూకుడు మీదున్న నేపథ్యంలో ఈ భూకంపంపై దక్షిణ కొరియా అనుకూల వర్గాల్లో అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. దీనిపై ఉత్తర కొరియా ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.
 

మరిన్ని వార్తలు