తక్కువగా తింటే.. 'ఆ' సామర్థ్యం పెరుగుతుందట!

7 May, 2016 17:05 IST|Sakshi
తక్కువగా తింటే.. 'ఆ' సామర్థ్యం పెరుగుతుందట!

మీరు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ప్రయత్నిస్తున్నారా? అందుకోసం తక్కువగా తింటూ.. బరువు కూడా తగ్గించుకుంటున్నారా.. అయితే మంచిదే. ఎందుకంటే.. అలా చేయడం వల్ల లైంగిక సామర్థ్యం పెరుగుతుందని శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. తక్కువగా తినడం వల్ల మూడ్ బాగుంటుందని, టెన్షన్ తగ్గుతుందని, ఫలితంగా సంసార జీవితం చాలా బాగుంటుందని చెబుతున్నారు. ఇందుకోసం 218 మంది ఆరోగ్యవంతమైన వ్యక్తుల ఆహారపు అలవాట్లను రెండేళ్ల పాటు లూసియానాలోని పెన్నింగ్టన్ బయోమెడికల్ రీసెర్చ్ సెంటర్ వాళ్లు పరిశీలించారు. వాళ్లను రెండు గ్రూపులుగా విభజించారు. ఒక గ్రూపు వాళ్లకు భోజనాన్ని క్రమంగా 25 శాతం తగ్గించారు. మరో గ్రూపు వాళ్లకు మాత్రం మామూలు భోజనమే పెట్టించారు.

వాళ్లలో భోజనం తక్కువగా తీసుకున్నవాళ్లు తమ సంసార జీవితాన్ని అంతకుముందు కంటే బాగా ఆస్వాదించినట్లు చెప్పారు. మిగిలినవాళ్లు మాత్రం మామూలుగానే ఉన్నారు. భోజనాలు తగ్గించినవాళ్లకు బరువు కూడా తగ్గి నిద్ర బాగా పట్టినట్లు తెలిపారు. బరువు ఎక్కువగా ఉండటం వల్ల నిద్ర సరిగా పట్టదని, దాంతో సంసార జీవితంపై కూడా దాని ప్రభావం పడుతుందని శాస్త్రవేత్తలు చెప్పారు. ఈ పరిశోధన వివరాలు జామా ఇంటర్నల్ మెడిసిన్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. అలాగే ఒకవేళ భాగస్వామి తక్కువగా తింటూ.. ఆ విషయంలో చురుగ్గా ఉంటే, వాళ్ల భార్య/భర్త కూడా అదే అలవాటు చేసుకుంటారని కూడా మరో పరిశోధనలో తేలింది. దీన్ని సోషల్ మోడలింగ్ అంటారని, ఇది ఈమధ్య కాలంలో బాగా ఎక్కువైందని కూడా పరిశోధకులు చెప్పారు.

మరిన్ని వార్తలు