మిరపకాయలతో గుండెపోటుకు చెక్‌!

17 Dec, 2019 18:05 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

న్యూఢిల్లీ : భోజనంలో వారానికి నాలుగుసార్లు మిరప కాయలు తింటే గుండె పోటు వచ్చే ప్రమాదం దాదాపు 40 శాతం తగ్గుతుందట. ఇటలీకి చెందిన పరిశోధకులు 23 వేల మంది వాలంటీర్లపై ఎనిమిదేళ్లపాటు సుదీర్ఘ అధ్యయనం జరిపి ఈ విషయాన్ని కనుగొన్నారు. మిరపకాయల్లో ఉండే ‘యాంటి ఆక్సిడెంట్‌’ గుణం కలిగిన ‘క్యాప్‌సేసియన్‌’ పదార్థం వల్లనే గుండెకు రక్షణ కలుగుతోందని వారు తేల్చారు.

ప్రపంచంలోనే ఆరోగ్యకరమైన డైట్‌గా పరిగణిస్తున్న ‘మెడిటెరేనియన్‌ డైట్‌ (మధ్యస్థ డైట్‌)’ను ఎక్కువగా తీసుకొనే ఇటలీలోని మొలిస్‌ ప్రాంతానికి చెందిన ప్రజలపై ఈ పరిశోధనలు జరిపారు. ఆ ప్రాంతం ప్రజలు ఎక్కువగా కూరగాయలు, గింజ ధాన్యాలు, పండ్లు, చేపలు తీసుకొని తక్కువగా గుడ్లు, మాంసం తీసుకుంటారు. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటున్న వారిపై పరిశోధనలు జరపడం వల్లనే తమకు మంచి ఫలితాలు లభించాయని పరిశోధకులు చెబుతున్నారు.

23 వేల మంది ఆహార అలవాట్లను పర్యవేక్షించగా ఎనిమిదేళ్ల కాలంలో 1236 మంది మరణించారని. వారిలో క్యాన్సర్‌ కారణంగా మూడొంతుల మంది మరణించగా, గుండె పోటు కారణంగా కూడా దాదాపు అంతే మంది మరణించారని పరిశోధకులు తెలిపారు. గుండెపోటుతో మరణించిన వారిలో మూడొంతుల మంది ఎప్పుడు మిరపకాయలు భోజనంలో తీసుకోలేదని, కేవలం 24 శాతం మంది మాత్రమే తీసుకున్నారని పరిశోధకులు తేల్చారు. చనిపోయిన వారి వయస్సు, వారి ఆహారపు అలవాట్లను పరిగణలోకి తీసుకొని అధ్యయనం జరపడం ద్వారా వారానికి నాలుగుసార్లు ఆహారంలో మిరపకాయలను తీసుకోవడం వల్ల గుండెపోటు వచ్చే అవకాశం 40 శాతం తక్కువని వారు నిర్ధారించారు. ఈ అధ్యయనం వివరాలను ‘అమెరికన్‌ కాలేజ్‌ ఆఫ్‌ కార్డియాలోజీ’ జర్నల్‌ తాజా సంచికలో ప్రచురించారు.

పర్చి మిరపకాయలు తినాలా, ఎర్రటి మిరప కాయలు తినాలా? వాటిని ఎలా తినాలో మాత్రం వారు అందులో వెల్లడించలేదు. ఇటలీ ప్రజలు వారికి అక్కడ దొరికే ఎర్రటి మిరప కాయలనే తింటారు. వారు వాటిని మసాలా దట్టించి కానీ, పలు రకాల సాస్‌లతోగానీ తింటారు. అలా వారానికి నాలుగు సార్లు తింటే చాలట.

మరిన్ని వార్తలు