అసాంజేకు ఇంటర్నెట్‌ నిలిపివేత

29 Mar, 2018 11:20 IST|Sakshi
వికీలీక్స్‌ వ్యవస్థాపకుడు జూలియన్‌ అసాంజే

లండన్‌ : వికీలీక్స్‌ వ్యవస్థాపకుడు జూలియన్‌ అసాంజేకు ఇంటర్నెట్‌ సదుపాయాన్ని నిలిపివేస్తున్నట్టు ఈక్వెడార్‌ ప్రకటించింది. కాటాలోనియన్‌ వేర్పాటువాది అరెస్ట్‌కు వ్యతిరేకంగా సోషల్‌ మీడియా ద్వారా అసాంజే తన అభిప్రాయాన్ని తెలుపడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని ఈక్వెడార్‌ రాయబార కార్యాలయ అధికారులు తెలిపారు. యూరప్‌ దేశాలతో తమ దేశ సంబంధాలను అసాంజే చర్యలు దెబ్బతీసే విధంగా ఉన్నాయన్నారు. ఈక్వెడార్‌ మాజీ అధ్యక్షుడు రఫెల్‌ కొరియా అధికారంలో ఉన్నప్పుడు అసాంజేకు మద్ధతుగా నిలిచినప్పటికీ, ప్రస్తుత అధ్యక్షుడు లెనిన్‌ మోరెనో రాజకీయ అంశాల్లో జోక్యం చేసుకోకూడదని  ఆయనను హెచ్చరించారు.

గతంలో అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో హిలరీ క్లింటన్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేసిన సమయంలో కూడా అసాంజేకు ఇంటర్నెట్ సౌకర్యాన్ని తొలగించారు. అసాంజేపై స్వీడన్‌లో అత్యాచారం కేసు నమోదు కావడంతో ఆయన 2012 నుంచి లండన్‌లోని ఈక్వెడార్ ఎంబసీలో తలదాచుకుంటున్నారు. బయటకు వస్తే పోలీసులు అరెస్టుచేసి స్వీడన్‌కు, తర్వాత అమెరికాకు అప్పగిస్తారన్నది అసాంజే భయం. ఇరాక్, అఫ్గానిస్తాన్‌లలో అమెరికా అకృత్యాల రహస్య సమాచారాన్ని ఆయన వికీలీక్స్ ద్వారా బయటపెట్టడం తెలిసిందే.

>
మరిన్ని వార్తలు