ఈ ఎమోజీలపై సోషల్‌ మీడియా నిషేధం

30 Oct, 2019 15:50 IST|Sakshi

న్యూఢిల్లీ : లైంగిక వాంఛను తెలిపే లేదా సూచించే ఎమోజీలపై ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ నిషేధం విధించింది. వంకాయ, పిక్క ఉండే పీచ్‌ పండు, కింద పడుతున్న నీటి బిందువుల ఎమోజీలు సహా లైంగిక కోరికలను తెలియజేసే ఇతర ఏ ఎమోజీని వాడరాదంటూ యూజర్లకు కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. అలాగే నగ్న ఫొటోల పోస్టింగ్‌ను కూడా నిషేధిస్తున్నట్లు యాజమాన్యం ప్రకటించింది. అయితే ఇవి ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయో తెలియజేయలేదు. ఈ రెండు సామాజిక వేదికలను వేశ్యలు తమ లైంగిక వ్యాపారం కోసం వాడుకోకుండా నివారించేందుకే ఈ నిషేధం తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.

వేశ్యల కోసమంటూ.. సరదాగా లైంగిక కోరికలపై జోకులు వేసుకోకుండా, కబుర్లు చెప్పుకోకుండా ఇదేమీ నిషేధమంటూ పలువురు యూజర్లు విమర్శిస్తున్నారు. వ్యక్తిగత ప్రచారం కోసం, వ్యాపారం కోసమే కాకుండా విద్వేష భావాల కోసం ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లను వినియోగించుకుంటున్నప్పటికీ పట్టించుకోని యాజమాన్యం ఈ ఎమోజీలను పట్టించుకోవడం ఏమిటని మరి కొందరు ప్రశ్నిస్తున్నారు. పరస్పర లైంగిక వాంఛలను తెలియజేసే ఇలాంటి ఎమోజీల వల్ల ముఖ్యంగా తన లాంటి పెళ్లయిన మగవాళ్లు అంతులేని బాధను అనుభవించాల్సి వస్తోందని ఇటీవల సోషల్‌ మీడియాలో వాపోయిన 42 ఏళ్ల ర్యాప్‌ సింగర్‌ కన్యే వెస్ట్‌కు ఇది శుభవార్త కావచ్చని ఒకరు వ్యాఖ్యానించగా, ఆయన భార్య కిమ్‌ కర్దాషియిని ‘ఎక్స్‌పోజింగ్‌’ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేస్తుంటే బాధ పడని వ్యక్తి, వీటికి ఎందుకు బాధ పడుతున్నారో అర్థం కావడం లేదని మరొకరు వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు