ఈజిప్ట్‌లో నరమేధం

24 Nov, 2017 21:10 IST|Sakshi

235 మందిని పొట్టనపెట్టుకున్న ‘ఉగ్ర’ రాక్షసులు

మసీదులో బాంబు దాడి, అనంతరం శుక్రవారం ప్రార్థనల్లో పాల్గొన్నవారిపై విచ్చలవిడిగా కాల్పులు

ఈజిప్ట్‌ చరిత్రలో ఇదే అతిపెద్ద ఉగ్ర దాడి

ఈజిప్ట్‌లో ఉగ్రవాదులు నరమేధం సృష్టించారు. బాంబులు, తుపాకులతో విరుచుకుపడి నెత్తుటేర్లు పారించారు. మసీదులో శుక్రవారం ప్రార్థనల్లో పాల్గొన్న అమాయకులపై గుళ్ల వర్షం కురిపించి 235 మంది నిండు ప్రాణాలను నిర్దాక్షిణ్యంగా తీసేశారు. ముందు మసీదులో బాంబు పేల్చి, అనంతరం భయంతో పారిపోతున్న వారిపై నలువైపుల నుంచి విచక్షణారహితంగా కాల్పులు జరిపి ఈ దారుణానికి పాల్పడ్డారు. ఇస్లామిక్‌ దేశం ఈజిప్ట్‌లోని సమస్యాత్మక ఉత్తర సినాయ్‌ ప్రాంతంలోని అల్‌–అరిష్‌ పట్టణంలో ఉన్న అల్‌–రౌదా మసీదులో ఈ ఘోరం చోటు చేసుకుంది. సాధారణంగా ఐఎస్‌ ఉగ్రసంస్థ ద్రోహులుగా పరిగణించే సూఫీలు ఈ మసీదులో ప్రార్థనలు జరుపుతారని స్థానికులు తెలిపారు.

కైరో: ఈజిప్ట్‌లో ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. అల్‌ అరిష్‌ పట్టణంలోని మసీదులో శుక్రవారం మధ్యాహ్నం పవిత్ర ప్రార్థనలు చేసుకుంటున్న సూఫీ ముస్లింలపై ఉగ్రవాదులు బాంబులు, భారీ ఆయుధాలతో దాడి చేశారు. ఆ దేశం గతంలో ఎన్నడూ చూడని రీతిలో దాదాపు 235 మందిని పొట్టనబెట్టుకున్నారు. మరో 109 మందిని గాయపరిచారు. ఈ దారుణ ఘటనతో  మసీదు ప్రాంగణమంతా చెల్లాచెదురుగా పడిన మృతదేహాలు,  క్షతగాత్రులు, రక్తపు ధారలతో భీతావహంగా మారింది.

నాలుగు వాహనాల్లో వచ్చిన ఉగ్రవాదులు తొలుత మసీదులోని చిన్నారుల సంరక్షణ కేంద్రం వద్ద బాంబు పేల్చారనీ, ఆ తర్వాత అక్కడి నుంచి పరుగులు తీస్తున్న ప్రజలపై బుల్లెట్ల వర్షం కురిపించారని ఈజిప్ట్‌ అధికార వార్తా సంస్థ ‘మెనా’ వెల్లడించింది. ఇది ఉగ్రదాడేనని ఈజిప్ట్‌ ఆరోగ్య శాఖ అధికార ప్రతినిధి మీడియాకు వెల్లడించారు. గాయపడిన వారిని వైద్యశాలలకు తరలించేందుకు 50కిపైగా అంబులెన్సులు ఘటనాస్థలం వద్దకు చేరుకున్నాయి.  

సూఫీలే లక్ష్యంగా..
సూఫిజం మద్దతుదారులు, ఈజిప్ట్‌ భద్రతాదళాలను సమర్థిస్తున్నవారు లక్ష్యంగా ఈ దాడి జరిగినట్లు స్థానికులు తెలిపారు. ఇస్లామిక్‌ స్టేట్‌(ఐఎస్‌) ఉగ్రసంస్థ కూడా సూఫీలను ఇస్లాం ద్రోహులుగా భావిస్తుంది. అయితే, ఈ దాడికి ఇంతవరకూ ఏ ఉగ్రవాద సంస్థా బాధ్యతను ప్రకటించుకోలేదు. దాడి చేసిన ఉగ్రవాదులు ఏమయ్యారన్న దానిపై కూడా సమాచారం లేదు. అయితే దాడి జరిగిన తీరును బట్టి ఇది ఐఎస్‌ ఉగ్రసంస్థ పని అయ్యుండొచ్చని భావిస్తున్నారు.

అధ్యక్షుడు అబ్దుల్‌ ఫతా ఎల్‌–సిసీ అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించి దాడి తీవ్రత, ప్రస్తుత పరిస్థితిపై చర్చించారు. ఈజిప్ట్‌ ప్రభుత్వం మూడు రోజులు సంతాప దినాలు ప్రకటించింది. మాజీ అధ్యక్షుడు హోస్ని ముబారక్‌ను పదవి నుంచి దింపివేసిన తర్వాత 2011 జనవరి నుంచి ఉత్తర సినాయ్‌ ప్రాంతంలో ఉగ్రవాదుల దాడులు పెరిగాయి. ఇస్లాంవాది అయిన మరో మాజీ అధ్యక్షుడు మహ్మద్‌ మోర్సీ 2013లో పదవి కోల్పోయాక ఈ ప్రాంతంలోని పోలీసులు, సైన్యం లక్ష్యంగా ఉగ్రవాదులు మరింత పేట్రేగిపోయారు.

అప్పటి నుంచి ఇప్పటికి 700 మందికిపైగా భద్రతా సిబ్బంది ఇక్కడ ప్రాణాలు కోల్పోయారు. ఈ ఏడాది తొలి నుంచీ ఈజిప్ట్‌లో ఉగ్రదాడులు ఎక్కడోచోట జరుగుతూనే ఉన్నాయి. మే 26న క్రైస్తవులను ఎక్కించుకుని వెళ్తున్న ఓ బస్సుపై జరిగిన దాడిలో 28 మంది మరణించారు. ఏప్రిల్‌ 9న కూడా అలెగ్జాండ్రియా, టాంట నగరాల్లోని చర్చిల వద్ద జరిగిన రెండు ఆత్మాహుతి దాడుల్లో 46 మంది
చనిపోయారు.

పిరికిపందల చర్య: ట్రంప్‌
దాడిలో మృతి చెందిన వారికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సంతాపం తెలిపారు. దాడిని పిరికిపందల చర్యగా అభివర్ణించిన ట్రంప్‌ ‘ప్రపంచం ఉగ్రవాదాన్ని ఇక భరించలేదు. మనం మన సైన్యాలతోనే వారిని ఓడించాలి’ అంటూ ట్వీట్‌ చేశారు.

‘ఉగ్ర’ పోరుకు మా మద్దతు: మోదీ
దాడిపై ప్రధాని మోదీ స్పందిస్తూ ‘ఈ ఆటవిక ఉగ్రవాదుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రాణాలు కోల్పోయిన అమాయకులకు దేశం తరఫున సంతాపం తెలియజేస్తున్నాను’ అంటూ ట్వీట్‌ చేశారు. ఉగ్రవాదంపై పోరాటంలో ప్రపంచ దేశాలకు భారత్‌ మద్దతుగా ఉంటుందని ఆయన భరోసానిచ్చారు. ఈజిప్టులో భారత రాయబారి సంజయ్‌ భట్టాచార్య కూడా దాడిని ఖండించారు.  

ప్రతీకారం తీర్చుకుంటాం: సిసీ
ఉగ్రవాదులపై తమ ‘క్రూర సైన్యం’ ద్వారా తగిన రీతిలో ప్రతీకారం తీర్చుకుంటామని ఈజిప్టు అధ్యక్షుడు అబ్దుల్‌ ఫతా ఎల్‌–సిసీ శపథం చేశారు. ఇలాంటి దాడుల వల్ల ఉగ్రవాదంపై పోరాటంలో తమ బలం మరింత పెరుగుతుందని ఆయన అన్నారు.  

మరిన్ని వార్తలు