ఈజిప్టు విమానం హైజాక్

29 Mar, 2016 12:15 IST|Sakshi
ఈజిప్టు విమానం హైజాక్

ఈజిప్టుకు చెందిన ఓ విమానం హైజాక్ అయింది. అలెగ్జాండ్రియా నుంచి కైరో వెళ్తున్న ఈజిప్ట్ ఎయిర్ విమానాన్ని ఉగ్రవాదులు హైజాక్ చేశారు. ఆ విమానాన్ని సైప్రస్‌లోని లార్నాక విమానాశ్రయంలో విమానాన్ని బలవంతంగా దించారు. భారత కాలమానం ప్రకారం ఉదయం 11 గంటల సమయంలో హైజాకర్లు కంట్రోల్ టవర్‌ను సంప్రదించారు. అరగంట తర్వాత విమానం ల్యాండ్ అయ్యేందుకు అనుమతి లభించింది. విమానంలో 81 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే, సుమారు 3 గంటల తర్వాత.. ప్రయాణికులలో ఉన్న నలుగురు విదేశీయులు, విమాన సిబ్బంది మినహా మొత్తం అందరినీ ఉగ్రవాదులు విడిచిపెట్టినట్లు ఈజిప్ట్‌ ఎయిర్ సంస్థ తెలిపింది. ఈ నలుగురు బ్రిటిషర్లు, అమెరికన్లని తెలుస్తోంది. దీంతో ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థే ఈ హైజాకింగ్‌కు పాల్పడి ఉంటుందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లార్నాక విమానాశ్రయం లెబనాన్‌కు సమీపంలో ఉంటుంది. తమ విమానం ఎంఎస్181 హైజాక్ అయిన విషయాన్ని ఈజిప్టు అధికారులు ధ్రువీకరించారు.

హైజాకర్లు ఇప్పటివరకు ఎలాంటి డిమాండ్లు బయటపెట్టలేదు. విమానాశ్రయంలో క్రైసిస్ టీమ్‌ను మోహరించారు. విమానంలో ఉన్న ఉగ్రవాదుల్లో కనీసం ఒకరి వద్ద ఆయుధాలు ఉన్నాయని రాయిటర్స్ వార్తా సంస్థ చెబుతోంది. ప్రాథమిక సమాచారం మేరకు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు ఈ విమానాన్ని హైజాక్ చేసినట్లు తెలుస్తోంది. సిరియాలో ఇటీవల పెద్ద ఎత్తున ఐఎస్ స్థావరాలపై అమెరికా దాడులు చేస్తోంది. దానికి ప్రతీకారంగానే విమానాన్ని హైజాక్ చేశారా అన్న విషయం తెలియాల్సి ఉంది .

హైజాక్ విషయమై వివరాలు క్రమంగా బయటకు వస్తున్నాయి. ఉగ్రవాదుల్లో ఒకరు తాను కట్టుకున్న బాంబుల బెల్టును పేల్చేస్తానంటూ పైలట్‌ను బెదిరించినట్లు తెలిసింది. కానీ మరోవైపు విమానంలో ఉన్న మహిళలు, పిల్లలను మాత్రం బయటకు పంపేసేందుకు ఉగ్రవాదులు అంగీకరించారు. తర్వాత నలుగురు విదేశీయులు మినహా అందరినీ విడిచిపెట్టారు.

హైజాక్ చేసిన వాళ్లలో ఒకరిని ఈజిప్టుకే చెందిన ఇబ్రహీం సమాహా అని ఈజిప్షియన్ మీడియా గుర్తించింది. కాగా, హైజాకర్లు తమకు సైప్రస్‌లో ఆశ్రయం కావాలని డిమాండ్ చేశారని స్టేట్ రేడియో తెలిపింది.

మరిన్ని వార్తలు