ఈఫిల్‌ టవర్‌ సందర్శనను నిలిపివేసిన సిబ్బంది

2 Aug, 2018 10:43 IST|Sakshi

పారిస్‌ : పారిస్‌లోని ఈఫిల్‌ టవర్‌ సందర్శనను అక్కడ విధులు నిర్వహిస్తున్న సిబ్బంది నిలిపివేశారు. సైట్‌ యాజమాన్యం తీసుకొచ్చిన నూతన విధానంతో ఈఫిల్‌ టవర్‌ సందర్శనకులు భారీ క్యూ లైన్లలో వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. వారిని నిలువరించడం సిబ్బందిగా కష్టంగా మారింది. దీంతో బుధవారం మధ్యాహ్నం సమ్మెకు దిగిన ఉద్యోగులు టవర్‌ మూసివేశారు. అప్పటికే లోనికి వెళ్లిన పర్యాటకులకు మాత్రం మినహాయింపునిచ్చారు. గురువారం కూడా ఇదే రకంగా నిరసన తెలుపనున్నట్టు ఉద్యోగులు ముందుగానే ప్రకటించారు. గతేడాది ప్రఖ్యాత కట్టడాన్ని దాదాపు 60 లక్షల మంది సందర్శించారు.

గత నెలలో ఈఫిల్‌ టవర్‌ సందర్శన టిక్కెట్లను సగం వరకు ఆన్‌లైన్‌లో ఉంచుతూ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకునే వారికి టైమ్‌స్లాట్‌లను ఎంచుకునే అవకాశం కల్పించారు. అంతేకాకుండా సందర్శకులు తీసుకునే టికెట్‌ను బట్టి వారికి ఒక్కోరకం ఎలివేటర్లను కేటాయించారు. దీంతో అసలు సమస్య తలెత్తింది. ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్‌ చేసుకున్న వారికి కేటాయించే ఎలివేటర్లు మధ్యాహ్నం వరకు సగం మేర ఖాళీగా దర్శనమిస్తాయి. ఆ తర్వాత ఎలివేటర్లలో రద్దీ పెరుగుతోంది. దీంతో పర్యాటకులు భారీ క్యూలైన్లలో నిరీక్షించాల్సిన పరిస్థితి.

దీనిపై ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడుతూ.. చాలా మంది పర్యాటకులు కూడా క్యూ లైన్లలో వేచి ఉండటంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. సందర్శకులను నియంత్రించడంలో తాము సహనం కొల్పోతున్నామని పేర్కొన్నారు. ఏ రకం టికెట్‌ తీసుకున్నా వారైనా అన్ని ఎలివేటర్లను ఉపయోగించుకునేలా నిబంధనల్లో మార్పులు చేయాలని కోరారు. కాగా ఈఫిల్‌ టవర్‌ను నిర్వహిస్తున్న ఎస్‌ఈటీఈ కంపెనీ మాత్రం తాము రోజుకు 10,000 టికెట్లు మాత్రమే ఆన్‌లైన్‌లో విక్రయిస్తున్నామని చెప్పారు. వేచి చూడాల్సిన సమయం కూడా చాలా తక్కువని పేర్కొన్నారు. ఇటీవలి కాలంలో ఏదో ఒక అంశంపై ఇక్కడి సిబ్బంది నిరసనలకు దిగడం తరచు జరుగుతూనే ఉంది.

మరిన్ని వార్తలు