బ్రిటన్‌ ప్రధాని రేసులో ఎనిమిది మంది!

27 May, 2019 11:26 IST|Sakshi

జూన్‌ 7న పదవి నుంచి వైదొలగనున్న థెరిసా మే

లండన్‌: బ్రిటన్ ప్రధాన మంత్రి థెరెసా తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడంతో.. ప్రధాని పదవికోసం చాలా మంది ఆశావాహులు పోటీపడుతున్నారు. జూన్‌ 7న తాను పదవి నుంచి వైదొలగుతానని తేల్చడంతో..  మే నుంచి అధికార పగ్గాలను స్వాధీనం చేసుకునేందుకు అధికార కన్జర్వేటివ్ పార్టీ నేతలు పోటీపడుతున్నారు.  బ్రిటన్‌ ప్రధాని పదవి కోసం దాదాపు ఎనిమిది మంది నేతలు పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. వాటిలో బ్రెగ్జిట్‌ను సమర్ధించే బోరిస్ జాన్సన్‌తో ముందంజలో ఉన్నారు. గతంలో విదేశాంగ మంత్రిగా పనిచేసిన బోరిస్ జాన్సన్ ఈ బరిలో ముందున్నా మరో ఏడుగురు రంగంలోకి దిగడంతో పోటీ పెరిగింది.  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బ్రిటన్‌లో జరుపనున్న మూడురోజుల అధికార పర్యటన ముగిసిన తర్వాత జూన్ 7న ప్రధాని పదవి నుంచి వైదొలుగుతానని థెరెసా మే ఇటీవల ప్రకటించారు.

దీంతో ప్రధాని పీఠాన్ని కైవసం చేసుకునేందుకు కన్జర్వేటివ్ పార్టీ నాయకుల్లో బోరిస్ జాన్సన్, బ్రిటన్ పర్యావరణ శాఖ మంత్రి మైఖేల్ గోవ్, బ్రెగ్జిట్ మాజీ మంత్రి డొమినిక్ రాబ్, బ్రిటన్ పార్లమెంట్ దిగువ సభ (హౌస్ ఆఫ్ కామన్స్) మాజీ నేత ఆండ్రియా లీడ్సమ్, విదేశాంగ శాఖ మంత్రి జెరేమీ హంట్, అంతర్జాతీయ అభివృద్ధి శాఖ మంత్రి రోరీ స్టీవర్ట్, ఆరోగ్య శాఖ మంత్రి మ్యాట్ హంకాక్, ప్రజా పనులు, పెన్షన్ల శాఖ మాజీ మంత్రి ఎస్థర్ మెక్‌వే ప్రయత్నాలు మొదలు పెట్టారు. కాగా జూన్‌ 10 నుంచి కొత్త ప్రధానిని ఎన్నుకునే పని కన్జర్వేటివ్‌ పార్టీలో మొదలవుతుందని చెప్పారు. బ్రెగ్జిట్‌ ఒప్పందం విషయంలో పలుమార్లు మేకి ఎదురుదెబ్బలు తగలడం తెలిసిందే. బ్రెగ్జిట్‌ తొలి దశ పూర్తయిన తర్వాత తాను ప్రధాని పదవి నుంచి తప్పుకుంటానని గతేడాది డిసెంబర్‌లోనే ఆమె తమ పార్టీ ఎంపీలకు హామీనిచ్చారు. అయితే బ్రెగ్జిట్‌ తొలిదశ పూర్తికాకముందే ఆమె ఇప్పుడు వైదొలగాల్సి వస్తోంది.

మరిన్ని వార్తలు