ఐన్స్టీన్ వందేళ్ల నాటి మాటే నిజమైంది!

16 Jun, 2016 16:09 IST|Sakshi
ఐన్స్టీన్ వందేళ్ల నాటి మాటే నిజమైంది!

జర్మనీకి చెందిన ప్రముఖ శాస్త్రవేత్త అల్బర్ట్ ఐన్స్టీన్ వందేళ్ల కిందట చెప్పిన విషయం నేడు ప్రయోగపూర్వకంగా వెలుగులోకి వచ్చింది. గురుత్వాకర్షణ తరంగాలను దాదాపు వందేళ్ల కిందట ఐన్ స్టీన్ ప్రస్తావించారు. అంతరిక్షంలో వాటి ఉనికిని, సమయానికి అనుగుణంగా అవి ఎలా ప్రవర్తిస్తాయన్న అంశాలపై అప్పట్లోనే ఐన్స్టీన్ వివరించారు. సాపేక్ష సిద్ధాంతం అంశాలపై అమెరికన్ శాస్త్రవేత్తలు నేటికీ పరిశోధన చేస్తూనే ఉన్నారు.

గురుత్వాకర్షణ తరంగాలను గతంలో ఉన్నట్లు గుర్తించినప్పటికీ వాటిని మన కంటికి కనిపించేలా చేసే సాధనాలను సైంటిస్టులు రూపొందించలేదు. బుధవారం తమ కృషి ఫలించిందని, ఆ తరంగాలను చూపించే సాధనం లేసర్ ఇంటర్ ఫెరో మీటర్ గ్రావిటేషనల్ వేవ్ అబ్జర్వేటరీ(లిగో)ను వాడి ఉనికిని గుర్తించారు. అంతరక్ష విజ్ఞానంలో శాస్త్రవేత్తలు మరో అడుగు ముందుకెశారని చెప్పవచ్చు. 1.4 బిలియన్ సంవత్సరాల వయసున్న బ్లాక్ హోల్స్ రెండు ఢీకొనగా గురుత్వాకర్షణ తరంగాలు ఏర్పడ్డట్లు కనుగొన్నారు. లిగోను ఉపయోగించి అంతుచిక్కని ఎన్నో అంతరిక్ష సంబంధ అంశాలకు సమాధానాలు రాబడతామని అమెరికన్ సైంటిస్టులు ధీమా వ్యక్తం చేశారు.

భవిష్యత్తులో కృష్ణబిలాలు (బ్లాక్ హోల్స్) ఎలా ఏర్పడతాయి, వాటితో పాటు మరిన్ని అంతరిక్ష రహస్యాలను ఛేదిస్తామని గ్లాస్గో యూనివర్సిటీ గ్రావిటేషనల్ రీసెర్చ్ టీమ్ డైరెక్టర్ షైలా రోవాన్ పేర్కొన్నారు. లిగో రెండు డిటెక్టర్స్ కలిగి ఉండగా, ఒకటి లివింగ్ స్టన్, లూసియానాలో, మరొకటి వాషింగ్టన్ లోని హంఫోర్డ్ లో మూడు వేల కి.మీ దూరంలో ఉన్నాయి. కొన్నిసార్లు రెండు బ్లాక్ హోల్స్ ఒకదాని చుట్టూ మరొకటి పరిభ్రమిస్తూ తమ శక్తిని కోల్పోయి ఒక బ్లాక్ హోల్ గా ఏర్పడతాయి. గురుత్వాకర్షణ తరంగాల సహాయంతో బ్లాక్ హోల్స్ కలయిక దృగ్విషయాన్ని తెలుసుకునేందుకు వీలుంటుంది.  

మరిన్ని వార్తలు