డైమండ్ 'చిన్నది'... పెళ్ళి వద్దంది!

23 Dec, 2015 13:37 IST|Sakshi
డైమండ్ 'చిన్నది'... పెళ్ళి వద్దంది!

పెళ్ళి నిశ్చితార్థానికి గుర్తుగా ఉంగరాలు మార్చుకుంటారు. అలాగే ఓ యువతిని పెళ్ళికి ప్రపోజ్ చేసిన యువకుడు ఉంగరం చేయిస్తానని మాటిచ్చాడు. అన్నట్టుగానే చేయించాడు కూడా. కానీ ఉంగరంలోని డైమండ్ చిన్నదైందంటూ ఏకంగా పెళ్ళికే ససేమిరా అందా మగువ. ఎంగేజ్ మెంట్ రింగ్ లో డైమండ్ చిన్నదైనందుకు  పెళ్ళినే నిరాకరించింది. చైనా సిచువాన్ ప్రావిన్స్ లో చోటు చేసుకున్న ఘటన అందరినీ షాక్ కు గురిచేసింది.

పాపం ఆ ప్రేమికుడు... ప్రేయసిని ఉంగరంతో ఆశ్చర్యపరచాలనుకున్నాడు. పార్టీకి పిలిచి డైమండ్ రింగ్ బహూకరించి పెళ్ళి చేసుకుందామన్న ప్రపోజల్ తో సిద్ధంగా వచ్చాడు. తీరా ఆమె ఉంగరంలో చిన్న డైమండ్ ఉందంటూ పెళ్ళినే నిరాకరించడంతో  వందలమంది డ్యాన్సర్లు ముందే మోకరిల్లాడు. ఎంతగానో బతిమలాడాడు.  అయితేనేం వజ్రంలాంటి కుర్రాడికన్నా ఉంగరంలోని వజ్రానికే ఆ చిన్నది ప్రాముఖ్యతనిచ్చింది. పెళ్ళి గిళ్ళి జాంతానై.. అంటూ అక్కడినుంచీ వెళ్ళిపోయింది.    

నైరుతి చైనా రాజధాని, సుచియాన్ ప్రావిన్స్ నగరంలో ఆమె చేస్తున్న చెంగ్డూ నృత్యాన్ని చూసి ఆ ప్రేమికుడు ఫిదా అయిపోయాడు. ఆమె వెంటపడి తన ప్రేమను తెలిపాడు. అలాగే పెళ్ళికి కూడ ప్రపోజ్ చేశాడు. వజ్రం ఉంగరం ఇస్తామని ప్రామిస్ చేశాడు. అన్నట్లుగానే తన బాయ్ ఫ్రెడ్ వజ్రం ఉంగరాన్ని తెచ్చివ్వడాన్ని చూసి ఆమె ఎంతో సంతోషపడిపోయింది. అతడు తన ప్రేమను వ్యక్తం చేస్తూ.. బాక్స్ నుంచి ఉంగరం బయటకు తీశాడు. అంతే.. ఆమె ముఖం మాడిపోయింది. ఏంటీ ఇంత చిన్న వజ్రమా అంటూ ఉంగరంతోపాటు అతడి ప్రపోజల్ నూ తిప్పి కొట్టింది. అతడితో మరో మాట మాట్లాడకుండా అక్కడినుంచీ వెళ్ళిపోయింది. జరిగిన తతంగంపై ఆ ప్రియురాలు  'వియ్ ఛాట్' లో తన స్నేహితురాలితో సంభాషించింది.  ఆ తర్వాత  ఆ మెసేజ్  స్క్రీన్ షాట్ గా మారి... ఆన్ లైన్ లో లీకయింది. ఓ కథలా పబ్లిష్ అయ్యింది.

తనకు ప్రపోజ్ చేసినప్పుడు వన్ కేరెట్ వజ్రంతో ఉంగరం చేయిస్తానన్నాడని,  తీరా నిశ్చితార్థానికి అంత చిన్న వజ్రం ఉంగరం ఇవ్వడంలో అతని ఉద్యేశ్యం ఏమిటంటూ ఆమె తన అభద్రతా భావాన్ని మెసేజ్ లో వ్యక్త పరిచింది.  అతడు తనగురించి ఎప్పుడూ ఆలోచించలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో ఆమె ఫ్రెండ్ ''బాధపడకు నీకోసం మరో పెద్ద రింగ్ ఎదురు చూస్తూ ఉండి ఉంటుందిలే'' అంటూ ఆమెకు సర్ది చెప్పింది. ఇలా మెసేజ్ ల ద్వారా విషయం లీక్ అవడంతో ఆ ప్రేమికుల కథ బట్టబయలైంది. సో అబ్బాయిలూ ప్రపోజ్ చేసేంముందు కాస్ల ఆలోచించి మరీ వాగ్దానాలు చేయాలని మర్చిపోకండి.

మరిన్ని వార్తలు