వాట్‌ ఏ డేర్‌.. బోర్డర్‌ దాటి తిరిగొచ్చిన ఏనుగు..

29 Jan, 2018 12:15 IST|Sakshi
చైనా సరిహద్దు గేటును దాటుతున్న ఏనుగు

బీజింగ్‌ : ఒక్కోసారి మనుషులు కూడా చేయలేని సాహసాలు జంతువులు చేస్తుంటాయి. అలాంటివి జరుగుతున్నప్పుడు షాక్‌ గురవ్వడం తప్ప ఏం చేయలేము. దేశ సరిహద్దులు దాటడం అంటే ఎంత సాహసంతో కూడిన పనో అందరికీ తెలిసిందే. అయితే, ఈ విషయం మాత్రం తనకు చాలా తేలిక అని ఓ ఏనుగు నిరూపించింది. చైనా సరిహద్దును సునూయాసంగా దాటి లావోస్‌లోకి అడుగుపెట్టి దాదాపు రెండుగంటల తర్వాత తిరిగి వెనక్కు వచ్చింది. సీసీటీవీ ఫుటేజీలో రికార్డయిన ఈ వీడియో ఇప్పుడు పలు చర్చలకు దారి తీసింది. శనివారం తెల్లవారు జామున చైనాలోని యునాన్‌ ప్రావిన్స్‌కు లావోస్‌కు మధ్య ఉన్న సరిహద్దును ఓ ఏనుగు దాటింది. ఆ సమయంలో అధికారులు చూసినప్పటికీ ఏం చేయలేకపోయారు.

అయితే, ఆ ఏనుగు వస్తున్న విషయాన్ని మాత్రం సమీప ప్రజలకు తెలిపి అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ప్రత్యేకంగా రెండు బృందాలు సిద్ధం చేశారు. అయితే, రెండుగంటలపాటు లావోస్‌ భూభాగంలో తిరిగిన ఆ ఏనుగు తిరిగి తన దేశం భూసరిహద్దులోకి తిరిగి అదే బోర్డర్‌ గేటు నుంచి వెనక్కి వచ్చింది. ఇది చూసి అక్కడి అధికారులు ఆశ్చర్యపోయారు. ఇదేదో మార్నింగ్‌ జాగింగ్‌ పోయి వచ్చినట్లుందే అని అనుకుంటూ నవ్వుకున్నారు. కాగా, దీనిపై అధికారులు వివరణ ఇస్తూ చలికాలంలో యునాన్‌ ప్రావిన్స్‌లోని అడవుల్లో సరిగా ఆహారం లభించదని, దాని వల్లే అప్పుడప్పుడు ఇలా జంతువులు ప్రాంతాలు మారుతుంటాయని, అయితే, తొలిసారి మాత్రం ఒక ఏనుగు గేటు దాటి వెళ్లడం తిరిగి వెనక్కి రావడం జరిగిందని తెలిపారు.

మరిన్ని వార్తలు