చనిపోతానని తెలిసినా అక్కడికి వెళతా..

26 Nov, 2018 19:36 IST|Sakshi

న్యూయార్క్‌ : చంద్రమండలానికి పర్యాటకులను పంపే ఏర్పాట్లు చేస్తున్న స్పేస్‌ఎక్స్‌ అధినేత ఎలన్‌ మస్క్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భూమి మీద జీవించడం తనకు బోర్‌ కొట్టిందని, అంగారక గ్రహంపై నివసించాలని కోరుకుంటున్నానన్నారు. అక్కడ తాను జీవించి ఉండే పరిస్థితి లేకున్నా తాను అంగారక యాత్రకు వెళ్లే అవకాశాలు 70 శాతం ఉన్నాయని స్పష్టం చేశారు.  అంతరిక్ష యానంలో అద్భుతాలు అనదగిన పలు వినూత్న అంశాలను తాము ఇటీవల కనుగొన్నామని, ఇవి తనను ఉత్కంఠకు లోనుచేస్తున్నాయని మస్క్‌ హెచ్‌బీఓకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నట్టు స్ధానిక మీడియా వెల్లడించింది. తాను అక్కడికి వెళ్లేందుకు సన్నద్ధమవుతున్నానని ఆయన తన ఆసక్తిని వెల్లడించారు.

తన ఆకాంక్ష సవాల్‌తో కూడినదేనని ఆయన అంగీకరించారు. భూమి కంటే ఎంతో ఎత్తులో ఉన్న అంగారక గ్రహంపై మరణించే అవకాశాలు అధికమని అన్నారు. అంగారక గ్రహానికి మనిషి చేరుకున్నా అక్కడి సంక్లిష్ట పరిస్ధితులను నెగ్గుకురాలేక మరణిస్తాడని చెప్పుకొచ్చారు. అలాంటి పరిస్థితులున్నా తాను వెళ్లేందుకే మొగ్గుచూపుతానని మస్క్‌ తెలిపారు. పర్వతాలను అధిరోహించే ఆసక్తి కలిగిన వారెందరో ప్రపంచంలో ఉన్నారని, మౌంట్‌ ఎవరెస్ట్‌ ఎక్కుతూ పలువురు ప్రాణాలు కోల్పోయినా ఆ సవాల్‌ను ప్రేమించే వారు ప్రయత్నిస్తూనే ఉన్నారని అన్నారు.

భూమి నుంచి చంద్రమండలానికి, అంగారకగ్రహానికి మనుషులను చేరవేసేందుకు మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్‌ సంస్థ అత్యాధునిక సౌకర్యాలతో బిగ్‌ ఫాల్కన్‌ రాకెట్‌ పేరుతో స్టార్‌షిప్‌ను రూపొందిస్తోంది. ఈ వాహనంలో జపాన్‌ ఫ్యాషన్‌ దిగ్గజం, బిలియనీర్‌ యుసకు మీజవ చంద్రమండలానికి పయనమయ్యేందుకు సిద్ధమైన సంగతి తెలిసిందే. స్టార్‌షిప్‌ 2023లో ప్రైవేట్‌ పాసింజర్‌తో చంద్రమండలానికి చేరుకోనుంది. జపాన్‌లోని ప్రముఖ ఆన్‌లైన్‌ ష్యాషన్‌ రిటైలర్‌ జోజో సీఈవో వ్యవస్ధాపకుడు మిజవ ఈ సాహస యాత్రకు రెడీ అవుతున్నారు.

మరిన్ని వార్తలు