రెండు గంటల్లో హైదరాబాద్ - శ్రీనగర్!

30 May, 2015 16:48 IST|Sakshi
రెండు గంటల్లో హైదరాబాద్ - శ్రీనగర్!

లాస్ ఏంజెలిస్: హైదరాబాద్ నుంచి శ్రీనగర్ దూరం ఎంతో తెలుసా.. ఏకంగా 2,400 కిలోమీటర్లు. అంతదూరం వెళ్లాలంటే సాధారణంగా అయితే గంటకు 60 కిలోమీటర్ల వేగంతో.. 40 గంటలు పడుతుంది. కానీ, రెండే రెండు గంటల్లో అంతదూరాన్ని అధిగమించగలమని మీకు తెలుసా? ప్రయాణికులు నిమిషాల్లోనే గమ్యస్థానానికి చేరుకుంటే ఎంత బాగుండనే ఓ ఆలోచన నుంచి ప్రముఖ అమెరికా వ్యాపారవేత్త ఎలాన్ మాస్క్‌కు ఓ అద్భుతమైన ఐడియా వచ్చింది. అదే 'హైపర్‌లూప్ రవాణా వ్యవస్థ'. ఇది వచ్చే ఏడాదికల్లా అమెరికాలో కార్యరూపం దాల్చబోతోంది.

ముందుగా ప్రయోగాత్మకంగా లాస్ ఏంజెలిస్ నుంచి 610 కిలోమీటర్ల దూరంలోని శాన్ ఫ్రాన్సిస్కోకు హైపర్‌లూప్ వ్యవస్థను నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఈ వ్యవస్థ అమల్లోకి వస్తే 610 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 30 నిమిషాల్లో చేరుకోవచ్చు. అంటే హైపర్‌లూప్ ద్వారా గంటకు దాదాపు 1200 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించవచ్చన్న మాట

ఓహ్.. విమానం కన్నా రెట్టింపు వేగం. వాట్ యాన్ ఐడియా!  610 కిలోమీటర్ల దూరం వరకు హైపర్‌లూప్ నిర్మాణానికి దాదాపు 1600 కోట్ల డాలర్లు ఖర్చు అవుతాయని దీని నిర్మాణానికి ముందుకొచ్చిన హైపర్‌లూప్ ట్రాన్స్‌పొటేషన్ టెక్నాలజీస్ (హెచ్‌టీటీ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ డర్క్ అహల్‌బార్న్ వియన్నాలో జరిగిన ఓ సదస్సులో వెల్లడించారు. జర్మనీలో జన్మించిన ఆయన ప్రస్తుతం అమెరికాలో పలు దిగ్గజ వ్యాపార సంస్థలను నిర్వహిస్తున్నారు.

హైపర్‌లూప్ టెక్నాలజీ అంటే ఏమిటీ?
ట్యూబ్ ఆకారంలో ఉండే రవాణా వ్యవస్థ. ఇందులో నుంచి గాలిని వెలికితీసి వ్యాక్యూమ్‌ను ఏర్పరుస్తారు. దీనిగుండా ప్రయాణికులను తీసుకెళ్లే వాహనాలు కాప్సుల్ ఆకారంలో ఉంటాయి. వాటికి చలన చోదక శక్తిని కలిగించేందుకు అయస్కాంతాలను అమరుస్తారు. వెలుపలి వాతావరణ పీడనం, భూమ్యాకర్శన శక్తిని తగ్గించేందుకు ఈ వ్యవస్థను పూర్తిగా వంతెనల్లాగా భూమి పైభాగంలోనే నిర్మిస్తారు. మొత్తం ఎనిమిది మంది ప్రయాణించే వీలున్న కాప్సుల్ వాహనాలను తయారు చేస్తారు. ప్రతి 30 సెకండ్లకో కాప్సుల్ వాహనాన్ని దీని గుండా పంపిస్తారు. ఈ మొత్తం వ్యవస్థకు అవసరమయ్యే విద్యుత్‌ను సౌర విద్యుత్ ద్వారా సమకూర్చుతారు. లాస్ ఏంజెలిస్ నుంచి శాన్ ఫ్రాన్సిన్కోకు హైపర్‌లూప్‌లో వెళ్లే ప్రయాణికుడి వద్ద నుంచి 20 డాలర్లను చార్జీకింద వసూలు చేయాలన్నది ప్రాథమిక అంచనా.

కేవలం ప్రయాణికుల పీక్ టైమ్‌లోనే చార్జీలు వసూలు చేస్తామని, లీన్ పీరియడ్‌లో ఉచితంగానే ప్రయాణికులను అనుమతిస్తామని డర్క్ అహల్‌బార్న్ తెలిపారు. హైపర్‌లూప్ అంచనాలకు సరిపడా పెట్టుబడులను ఎలా సమకూరుస్తున్నారని ప్రశ్నించగా, ఇప్పటికే ఎంతోమంది పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చారని, తమ లక్ష్యానికి తాము అతి దగ్గరలో ఉన్నామని ఆయన వివరించారు. ప్రయాణికుల నుంచి చార్జీల కింద 20 డాలర్లను మాత్రమే వసూలు చేయడం ద్వారా ప్రాజెక్టు ఎలా లాభదాయకం అవుతుందని ప్రశ్నించగా, హైపర్‌లూప్ నడవడానికి సౌరశక్తి తక్కువే ఖర్చవుతోందని, మిగులు విద్యుత్‌ను ఇతర అవసరాలకు విక్రయించడం ద్వారా ప్రాజెక్టును లాభదాయకం చేయవచ్చని ఆయన తెలిపారు.

వాస్తవానికి హైపర్‌లూప్ రవాణా వ్యవస్థ ఎలాన్ మాస్క్ సొంతాలోచన. ఆయన ఈ విషయాన్ని 2013లోనే బయటపెట్టారు. ఈ ఆలోచనను మరింత అభివృద్ధిచేసి కార్యరూపంలోకి తీసుకరావాల్సిందిగా వ్యాపారవేత్తలను ఆయన బహిరంగంగా ఆహ్వానించారు. ఆ ఆహ్వానాన్ని అందిపుచ్చుకున్న డర్క్ ముందుకొచ్చారు. ఈ ప్రాజెక్టుకు అవసరమైన దాదాపు ఐదువేల ఎకరాల భూమిని కూడా కొనుగోలు చేసినట్టు ఆయన చెప్పారు.

మరిన్ని వార్తలు