మొన్న క్రేన్.. ఇప్పుడు వీల్ చెయిర్!

20 Apr, 2017 15:39 IST|Sakshi


ఆమె వయసు కేవలం 36 సంవత్సరాలు.. బరువు మాత్రం 500 కిలోలకు పైమాటే. ఆ భారీ శరీరంతో కష్టాలు భరించలేక.. బరువు తగ్గించుకునే చికిత్స చేయించుకోడానికి ఇమాన్ అహ్మద్ అబ్దులాటి ఫిబ్రవరి రెండో వారంలో ముంబైలోని సైఫీ ఆస్పత్రిలో చేరారు. ఈజిప్టుకు చెందిన ఈమెను అక్కడి నుంచి సాధారణ విమానంలో తీసుకురావడం సాధ్యం కాకపోవడంతో.. కార్గో విమానంలో తెచ్చారు. అక్కడినుంచి టెంపోలో ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రి మొదటి అంతస్తుకు ఆమెను మామూలుగా తీసుకెళ్లడం సాధ్యం కాకపోవడంతో..  పేషెంటు బెడ్‌కు గట్టి తాళ్లను కట్టి, భారీ క్రేన్ సాయంతో ఆ బెడ్‌ను మొదటి అంతస్తు వరకు తీసుకెళ్లారు. ఇదంతా రెండు నెలల క్రితం మాట. ఇప్పుడు ఆమె బరువు బాగా తగ్గిపోయింది. దాదాపు సగానికి పైగా బరువును ఆమె కోల్పోవడంతో.. ఇప్పుడు వీల్‌చెయిర్‌లో కూడా కూర్చునే పరిస్థితికి చేరుకుంది. ఎక్కువ సేపు కూర్చోడానికి కూడా ఆమె శరీరం అనువుగా ఉందని ఆమెకు చికిత్స అందించిన సైఫీ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. గతంతో పోలిస్తే చాలా సన్నగా.. సంతోషంగా ఉన్న ఇమాన్ అహ్మద్ అబ్దులాటి వీడియో ఒకదాన్ని ఆస్పత్రి వైద్యులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

మూడు నెలల క్రితం కనీసం ఆమె ఎప్పటికైనా కూర్చోగలదా అన్న అనుమానం తమకు ఉండేదని, కానీ ఇప్పుడు వీల్‌చెయిర్‌లో ఎక్కువసేపు కూర్చోగల సామర్థ్యం ఆమెకు వచ్చిందని డాక్టర్ అపర్ణా గోవిల్ తెలిపారు. ఇంతకుముందు కంటే ఆమె చాలా అప్రమత్తంగా ఉంటోందని, క్రమం తప్పకుండా ఆమెకు ఫిజియోథెరపీ కూడా జరుగుతోందని వివరించారు. ఆమెకు ముందునుంచి ఉన్న నరాల సమస్యల గురించే వైద్యులు ఇప్పుడు ఆందోళన చెందుతున్నారు. మూడేళ్ల క్రితం ఆమెకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. దాని తాలూకు ప్రభావం ఇప్పటికీ ఇమాన్ మీద కనిపిస్తోంది.

చదవండి:  భారీ కాయాన్ని మోయలేక..

మరిన్ని వార్తలు