ఎంత కాలం ‘సింగిల్‌’గా ఉంటావ్‌..

30 Dec, 2019 14:29 IST|Sakshi

పారిస్‌లో పుట్టి ఇంగ్లండ్‌లో పెరిగిన ప్రముఖ ఆంగ్ల నటి, మోడల్, సామాజిక కార్యకర్త ఎమ్మా వాట్సన్‌కు పలు ప్రాంతాల నుంచే కాకుండా పలు దేశాల నుంచి పెళ్లి ప్రతిపాదనలు వచ్చినా ఆమె నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తున్న విషయం తెల్సిందే. 30 ఏళ్ల వచ్చినా ఇంకా పెళ్లి చేసుకోకుండా ఇంకా ఎంత కాలం ‘సింగిల్‌’గా ఉంటావని ఆమెను ఇటీవల ‘వోగ్‌’ పత్రిక ఓ ఇంటర్వ్యూలో ప్రశ్నించగా, పెళ్లి మాటను పక్కన పెట్టి ‘సింగిల్‌’ మాటకు ఆమె కొత్త భాష్యం చెప్పడంతోపాటు కొత్త ప్రత్యామ్నాయ పదాన్ని సూచించారు. 

‘నన్ను సింగిల్‌ మహిళగా పిలవద్దు. నేను స్వీయ భాగస్వామిని (సెల్ఫ్‌ పార్టనర్డ్‌)’ అని వాట్సన్‌ సూచించారు. ఈ రోజుల్లో 25 ఏళ్లు దాటినా పెళ్లి చేసుకోని యువతులను ‘సింగిల్‌ విమెన్‌’ అని పిలుస్తున్న విషయం తెల్సిందే. 17వ శతాబ్దంలో పెళ్లీడు వచ్చినా పెళ్లి చేసుకోని యువతులను ‘స్పిన్‌స్టర్‌’ అని పిలిచే వారు. అంతకుముందు ‘ఓల్డ్‌ మెయిడ్స్‌’ అని, ‘వర్జిన్‌’ అని లేదా ‘ప్యుయెల్లా (స్పానిష్‌లో బాలిక అని అర్థం)’ అని పిలిచేవారు. 17వ శతాబ్దంలో ఇంగ్లండ్, ఇతర యూరప్‌ దేశాల్లో పాతికేళ్ల లోపే మహిళలు పెళ్లి చేసుకునే వారు. అది 18వ శతాబ్దంలో పెళ్లి చేసుకునే సరాసరి సగటు వయస్సు పాతికేళ్ల నుంచి 30వ దశకంలో పడగా, ఇప్పుడది 40వ దశకంకు చేరింది. 

పెళ్లితో పాటు కొత్తింట్లో ప్రవేశించాలనే లక్ష్యం యువతీ యువకులు పెట్టుకోవడంతోనే మహిళల పెళ్లీడు కాస్త 40వ దశకంకు క్రమేణ చేరుకుందని ‘నార్త్‌ వెస్టర్న్‌ యూరోపియన్‌ మ్యారేజ్‌ ప్యాటర్న్‌’ పరిశోధనాత్మక పుస్తకం రాసిన జాన్‌ హజ్‌నాల్‌ తెలిపారు. దాంతో ఆయా దేశాల్లో పెళ్లి చేసుకోకున్నా కలసి సహజీవనం చేయడం మొదలయింది. దాంతో మొదట్లోనే ‘వర్జిన్‌’ అనే పదం కాలగర్భంలో కొట్టుకుపోయింది. ఆర్థిక కారణాల వల్ల 19వ శతాబ్దంలో యువతులు ఆలస్యంగా పెళ్లి చేసుకోగా, 20–21వ శతాబ్దం సంధికాలంలో పెళ్లి చేసుకోకుండా జీవితాంతం ఒంటరిగా ఉండిపోయే ‘సింగిల్‌ విమెన్‌’ సంఖ్య గణనీయంగా పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం ఇంగ్లండ్‌లో పెళ్లి చేసుకోకుండా ఉండిపోతున్న మహిళల సంఖ్య ఆశ్చర్యంగా 30 శాతానికి చేరుకుంది. 

పెళ్లి చేసుకోకపోతే కోతులు కొడతాయి!
17వ శతాబ్దానికి ముందు సంప్రదాయం పేరిట పెళ్ళిళ్లు ఎక్కువగా జరిగేవి. పెళ్లి చేసుకోని మహిళలను అపవిత్రులని, అంటరాని వారని అసహ్యించుకునేవారు. వాళ్లంతా నరకంలోకి వెళతారని, పెళ్లి చేసుకోనందుకు నరకంలో వారిని కోతులు కొరడాలు పట్టుకొని హింసిస్తాయనే నమ్మకాలు కూడా ఎక్కువగా ప్రచారంలో ఉండేవి. 17వ శతాబ్దంలో యూరప్‌లో శాస్త్రీయ విజ్ఞానం పెరగడం, ఆర్థిక కారణాల వల్ల మహిళలు పెళ్లి చేసుకోవడం ఆలస్యమవుతూ వచ్చింది. దీంతో 1690–1700 సంవత్సరాల కాలంలో ఒక్కసారిగా ఇంగ్లండ్‌లో జనాభా పెరుగుదల నిష్పత్తి హఠాత్తుగా పడిపోయింది. దాంతో అప్పటి ఇంగ్లీషు పాలకులు పెళ్లి చేసుకోని వారిపై ‘మ్యారేజ్‌ డ్యూటీ ట్యాక్స్‌’ విధించారు. 

అమెరికాలో కూడా....
బ్రిటన్‌ దేశంలోలాగా కాకపోయినా అమెరికాలో యువతీ యువకుల పెళ్లీడు వయస్సు పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం అమెరికాలో యువతుల పెళ్లీడు వయస్సు 28  కాగా, యువకులు పెళ్లీడు వయస్సు 30 ఏళ్లుగా ఉంది. గతంలో అక్కడ యువతుల సరాసరి పెళ్లీడు వయస్సు 20 కాగా, యువకుల వయస్సు 22గా ఉండింది. 

ఇంతకు పెళ్లిపై వాట్సన్‌ మాటేమిటీ!
సమాజంలో పేరు ప్రఖ్యాతులతోపాటు ఆస్తిపాస్తులు కూడా ఉన్నందున 30 ఏళ్ల ఒడిలో కూడా ఎందుకు ఒంటరిగా ఉంటున్నారని ‘వోగ్‌’ పత్రిక ఎమ్మా వాట్సన్‌ను ప్రశ్నించింది. ‘నేను ఒంటరిగా ఉన్నానని ఎవర న్నారు. నేను స్వీయ భాగస్వామిని. నా మీద నేను దష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నా లక్ష్యాలు, నా అవసరాలు సాధించడం నాకు ముఖ్యం. మరో వ్యక్తి మీద దృష్టి పెట్టాల్సిన అవసరం నాకు లేదు’ అంటూ ఆమె పెళ్లి మాటను ఆమె పక్కన పడేశారు. 

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు