మనస్సును హత్తుకుంటున్న కార్టూన్‌!!

4 Dec, 2018 12:07 IST|Sakshi

అక్షరాల ద్వారా చెప్పలేని భావాలను కార్టూన్‌ల ద్వారా పలికించవచ్చు. కొన్ని వాక్యాల్లో వర్ణించలేని భావాలని ఒకే ఒక బొమ్మ రూపంలో తెలియజేయడం కార్టూనిస్టుల ప్రత్యేకత. నవ్వించడం, కవ్వించడమే కాదు... ఆలోచింపజేయడం, మనసును ద్రవింపజేసే కార్టూన్లను రూపొందించడం కొంతమంది కళాకారులకే సొంతం. అమెరికాకు చెందిన వార్తా పత్రిక క్లారియన్‌ లెడ్జర్‌ ఎడిటోరియల్‌ కార్టూనిస్ట్‌ మార్షల్‌ రామ్సే కూడా ఆ కోవకు చెందిన వారే.

ప్రస్తుతం.. అమెరికా మాజీ అధ్యక్షుడు, దివంగత నేత జార్జ్‌ హెచ్‌. డబ్ల్యూ బుష్‌ ఙ్ఞాపకార్థం ఆయన వేసిన కార్టూన్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. భార్య బార్బరా, కూతురు రాబిన్‌తో బుష్‌కు ఉన్న అనుబంధాన్ని ఈ కార్టూన్‌ చక్కగా వర్ణించిందంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.


రామ్సే వేసిన కార్టూన్‌

సీనియర్‌ బుష్‌ అంత్యక్రియలు గురువారం పూర్తవనున్న విషయం తెలిసిందే. వాషింగ్టన్‌లోని నేషనల్‌ క్యాథడ్రల్‌ చర్చిలో అధికారిక లాంఛనాలతో ఓసారి, హూస్టన్‌లోని సెయింట్‌మార్టిన్‌ ఎపిస్కోపల్‌ చర్చిలో మరోసారి ఆయనకు వీడ్కోలు పలుకుతామని అధికారులు వెల్లడించారు. అయితే హూస్టన్‌లో ఆయన భార్య బార్బరా, కుమార్తె రాబిన్‌ పక్కన బుష్‌ పార్థివదేహాన్ని ఖననం చేయనుండటంతో దీని ఆధారంగా రామ్సే కార్టూన్‌ రూపొందించారు. ఫ్లైట్‌లో ప్రయాణించిన బుష్‌.. ఆయన భార్య బిడ్డలను చేరుకున్నట్టుగా కార్టూన్‌ వేసిన రామ్సే... ‘మీ కోసం ఇన్నాళ్లు ఎదురుచూశాం’  అంటూ అందులో అక్షరాలు పొందుపరిచారు.


మార్షల్‌ రామ్సే

ఇప్పుడు చావు కోసం ఎదురుచూస్తున్నా!
‘ఒకప్పుడు చావు అంటే నాకు చాలా భయం ఉండేది. చనిపోతాననే భయం నన్ను ఎప్పుడూ వెంటాడుతూ ఉండేది. కానీ కొన్ని రోజులుగా చావు కోసం ఎదురుచూస్తున్నా. ఎందుకంటే చనిపోయిన తర్వాత మనకు ఇష్టమైన, స్వర్గంలో ఉన్న మన ప్రియమైన వారిని కలుసుకోవచ్చు. అమెరికా మాజీ ప్రథమ మహిళ బార్బరా చనిపోయిన తర్వాత ఆమె ఙ్ఞాపకార్థం గీసిన కార్టూన్‌ ఈ ఆలోచన నుంచి పుట్టిందే. ప్రస్తుతం వేసిన జార్జ్‌ బుష్‌ కార్టూన్‌ అందరి మనసులను హత్తుకుంటోంది. ముఖ్యంగా జార్జ్‌ బుష్‌ మనుమరాలు జెన్నా బుష్‌ హాగర్‌ ఈ కార్టూన్‌ చూసి భావోద్వేగానికి లోనైంది’ అని రామ్సే తన ఫేస్‌బుక్‌ పేజీలో రాసుకొచ్చారు.

నేవీ పైలట్‌.. ప్రియమైన భర్త.. తండ్రి

జార్జ్‌ బుష్‌- బార్బరా బుష్‌లది 73 ఏళ్ల సుదీర్ఘ వైవాహిక జీవితం. గ్రాడ్యుయేషన్‌ చేస్తున్న సమయంలో ఏర్పడిన వీరి పరిచయం ప్రేమకు దారి తీసింది. ఆ తర్వాత అనతికాలంలోనే వీరు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఎంతో అన్యోన్యంగా మెదిలిన ఈ జంట ప్రతీ విషయంలో ఒకరికి ఒకరు అండగా నిలిచేవారు. బుష్‌కు సంబంధించిన ప్రతీ కార్యక్రమంలోనూ బార్బరా భాగమయ్యేవారు. అయితే ఈ ఏడాది ఏప్రిల్‌లో బార్బరా ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోవడంతో బుష్‌ కుంగిపోయారు. భార్య మరణించిన నాటి నుంచి అనారోగ్యంతో పూర్తిగా చక్రాల కుర్చీకే పరిమితమయ్యారు. సుమారు ఏడు నెలల వ్యవధిలో ఈ దంపతులు మరణించారు.

లుకేమియాతో కుమార్తె మృతి...
జార్జ్‌ బుష్‌- బార్బరా దంపతులకు ఆరుగురు సంతానంతో పాటు మనుమలు, మనుమరాల్లు, మునిమనవలతో కూడిన అందమైన కుటుంబం ఉంది. వీరికి 1950లో ఈ జంటకు ఓ కుమార్తె జన్మించింది. ఆమె పేరు పౌలిన్‌ రాబిన్‌సన్‌. మూడేళ్ల ప్రాయంలో అంటే 1953లో లుకేమియా(క్యాన్సర్‌) బారిన పడి రాబిన్‌ మరణించింది. తమ జీవితంలో అత్యంత విషాదకర ఘటన రాబిన్‌ మరణమేనని బుష్‌ దంపతులు అనేక సందర్భాల్లో గుర్తుచేసుకునేవారు.

ఇక రెండో ప్రపంచ యుద్ధ కాలంలో నేవీ పైలట్‌గా వ్యవహరించి అమెరికా సాధించిన పలు విజయాల్లో బుష్‌ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. కాగా ఈ విషయాల ఆధారంగా విమానం బొమ్మ వేసిన రామ్సే... స్వర్గంలో ఆయన బార్బరా, రాబిన్‌సన్‌లను కలుసుకుని ఆనందపడుతున్నట్లుగా మరో చిత్రాన్ని గీశారు. దీనికి సోషల్‌ మీడియాలో అనూహ్య స్పందన లభిస్తోంది. గతంలో ఆయన వేసిన బార్బరా కార్టూన్‌కు కూడా ఇదే తరహాలో ప్రశంసలు వెల్లువెత్తాయి.


బార్బరా బుష్‌ మరణానంతరం రామ్సే వేసిన కార్టూన్‌

వైరల్‌గా మరో ఫొటో!
బుష్‌ ఙ్ఞాపకార్థం రామ్సే వేసిన కార్టూన్‌తో పాటుగా.. ఆయనకు సంబంధించిన మరో ఫొటో కూడా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. బుష్‌ భౌతికకాయం వద్ద ఆయన పెంపుడు శునకం సలీ విచారంగా పడుకున్న ఫొటో నెటిజన్ల హృదయాలను కదిలిస్తోంది. విశ్వాసానికి మారుపేరు శునకం అనే మాటను సలీ మరోసారి నిరూపించిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు