వుహాన్‌ నుంచే వైరస్‌ విడుదల.. ఆధారాలున్నాయి

4 May, 2020 08:29 IST|Sakshi

వాషింగ్టన్‌ : ప్రపంచ ప్రజానీకంపై తీవ్ర ప్రతాపం చూపుతున్న కరోనా రక్కసి చైనాలోని వుహాన్‌ ల్యాబ్‌ నుంచే విడుదలైందని అగ్రరాజ్యం అమెరికా మరోసారి ఆరోపించింది. కరోనా వైరస్‌ను వుహాన్‌ ల్యాబ్‌ నుంచి ఉద్దేశపూర్వకంగానే విడుదల చేశారని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. తమవి కేవలం ఆరోపణలు కాదని దీనికి సబంధించి సరైన సాక్ష్యాధారాలు తమ వద్ద ఉన్నాయని అమెరికా ప్రకటించింది. ఈ మేరకు అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో ఆదివారం  ఓ సమావేశంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా విస్తరించడానికి చైనా ప్రభుత్వమే కారణమంటూ విమర్శించారు. చైనా చేసిన కుట్రను ప్రపంచ దేశాల ముందు ఉంచుతామని మైక్‌ పాంపియో స్పష్టం చేశారు. కాగా వైరస్‌ విషయంలో యూఎస్‌ మొదటినుంచీ చైనాపై ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న విషయం తెలిసిందే. (చైనాపై లోతైన దర్యాప్తు)

తాజాగా జపాన్‌కు చెందిన శాస్త్రవేత్త ఒకరు అది వుహాన్‌లో రూపొందించిందేనని చెప్పిడంతో అమెరికా ఆగ్రహానికి ఆజ్యం పెసినట్లైయింది. ఇక కరోనా వైరస్‌ పుట్టినిల్లు అయిన చైనాపై తాము లోతుగా విచారణ జరుపుతున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇదివరకే ప్రకటించారు. వైరస్‌ కారణంగా జరిగిన నష్టానికి జర్మనీ కోరుతున్న 130 బిలియన్‌ యూరోల పరిహారం కంటే ఎక్కువ మొత్తాన్నే ఆ దేశం నుంచి రాబడతామని ట్రంప్‌ పేర్కొన్నారు. కరోనా వైరస్‌కు చైనాదే బాధ్యతనే విషయాన్ని పలు విధాలుగా రుజువు చేయవచ్చుననీ, దీనిపై అమెరికా తీవ్రంగా విచారణ జరుపుతోందని అగ్రరాజ్య అధినేత హెచ్చరికాలు జారీచేశారు. (కరోనా విపత్తు: చైనాను బెదిరించిన ట్రంప్‌!)

>
మరిన్ని వార్తలు