ప్రధాని సేల్స్‌గర్ల్‌, మంత్రులేమో చదువురాని వాళ్లు..

17 Dec, 2019 14:50 IST|Sakshi

ఫిన్‌లాండ్‌ ప్రధాని, ఆమె కేబినెట్‌పై ఇస్టోనియా మంత్రి అహంకారపూరిత వ్యాఖ్యలు

హెల్సెంకి:  ఫిన్‌లాండ్‌ ప్రధాని సనా మారినాపై ఇస్టోనియా దేశపు మంత్రి అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గానూ.. ఆ దేశ అధ్యక్షురాలు కెర్ట్సీ కాల్‌జులాద్‌ క్షమాపణలు చెప్పారు. ఇస్టోనియా హోంమంత్రి మార్ట్‌ హెల్మె తరఫున మారినా, ఆమె ప్రభుత్వాన్ని క్షమాపణ కోరుతున్నట్లు పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఫిన్‌లాండ్‌ కేబినెట్‌కు తెలియజేయాలని ఫిన్‌లాండ్‌ అధ్యక్షుడు సౌలీ నినిస్టోకు ఆమె విఙ్ఞప్తి చేశారు. ప్రపంచ దేశాల్లో అత్యంత పిన్న వయస్కురాలైన ప్రధాన మంత్రిగా ఫిన్‌లాండ్‌ ప్రధాని సనా మారిన్‌ చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. అంతేకాదు తన కేబినెట్‌లోనూ అత్యధికంగా 12 మంది మహిళలకు స్థానం కల్పించారు. ఈ మంత్రుల్లో ఒక్కరు మినహా మిగిలిన వారంతా 30-35 ఏళ్ల మధ్య వయసున్న గలవారే కావడం విశేషం.

ఈ నేపథ్యంలో ఫిన్‌లాండ్‌ కొత్త ప్రధాని, ఆమె ప్రభుత్వం గురించి ఇస్టోనియా హోం మంత్రి మార్ట్‌ హెల్మె మాట్లాడుతూ.. ‘సేల్స్‌ గర్ల్‌ సనా మారిన్‌కు నార్డిక్‌ దేశాన్ని పాలించే సామర్థ్యం ఉందా’ అని అహంకారపూరిత వ్యాఖ్యలు చేశారు. ‘ఇప్పుడు ఓ సేల్స్‌ గర్ల్‌ ప్రధాని అయ్యింది. గల్లీల్లో తిరిగే కార్యకర్తలు, చదువు లేని వాళ్లు ఆమె కేబినెట్‌లో మంత్రులుగా చోటు దక్కించుకున్నారు’ అని తమ పార్టీ రేడియో టాక్‌షోలో వ్యాఖ్యానించారు. దీంతో మార్ట్‌ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం చెలరేగింది. మహిళలపై, ఏకంగా దేశ అత్యున్నత పదవిలో ఉన్న ప్రధానిని కించపరిచిన మార్ట్‌ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలంటూ ప్రతిపక్షాలు ఆందోళన చేపట్టాయి. ఈ నేపథ్యంలో ఫిన్‌లాండ్‌ అధ్యక్షుడితో మాట్లాడిన ఇస్టోనియా అధ్యక్షురాలు.. తమ దేశం తరఫున సనా మారిన్‌, ఫిన్‌లాండ్‌ ప్రభుత్వాన్ని క్షమాపణ కోరారు.(‘వాటి గురించి అసలు ఆలోచించలేదు’)

కాగా ఆర్థికంగా వెనకబడిన కుటుంబం నుంచి వచ్చిన సనా మారిన్‌... విద్యాభ్యాసం చేస్తున్న సమయంలో ఓ సంస్థలో క్యాషియర్‌గా పనిచేశారు. సామాజిక కార్యకర్తగా ఎదిగి సోషల్‌ డెమొక్రాట్‌ పార్టీ తరఫున ప్రధానిగా ఎన్నికయ్యారు. ఈ విషయం గురించి మారిన్‌ ట్విటర్‌లో ప్రస్తావిస్తూ.. ‘ ఫిన్‌లాండ్‌ పట్ల నేను చాలా గర్వపడుతున్నాను. ఇక్కడ ఉన్న పేద పిల్లలందరినీ విద్యావంతులను చేసి... వారి జీవితంలో విజయవంతం అయ్యేలా చేస్తాం. ఇక్కడ ఓ క్యాషియర్‌ కూడా ప్రధాని అవ్వగలరు’ అని పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు