పెళ్లి కావాలంటే 'దూకుడు' ఉండాల్సిందే!

2 Oct, 2016 21:30 IST|Sakshi
పెళ్లి కావాలంటే 'దూకుడు' ఉండాల్సిందే!

ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి ఆఫ్రికా దేశం ఇథియోపియా గిరిజన ప్రాంతం ఓమీ లోయకు చెందిన హమర్ తెగ యువకుడు. ఇతడు ఇలా ఎద్దులపై నుంచి దూకడం వెనుక పెద్ద కథే ఉంది. అది ఏంటంటే.. పెళ్లీడుకు వచ్చిన యువకులు తమకు నచ్చిన యువతిని ఎంచుకోవడానికి హమర్ గిరిజన పెద్దలు ఏటా ‘జంపింగ్’ పోటీలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా వరుసగా నాలుగు కంటే ఎక్కువ ఎద్దులను నిలబెడతారు. వీటన్నింటిపై నుంచి కింద పడకుండా నడిచి అవతలివైపు దూకేయాలి. అలా చేసిన యువకులు మాత్రమే పెళ్లికి అర్హత సాధిస్తారు. లేదా నాలుగైదు ఎద్దుల పైనుంచి నేరుగా ఎగిరి దూకిన వారు పోటీలో గెలుపొందినట్లే. పోటీలో విఫలమైతే కొన్నిసార్లు జీవితాంతం బ్రహ్మచర్యం పాటించాల్సి ఉంటుందట. పెళ్లి జరిగిన రోజు మాత్రం దంపతులు అలసిపోయేలా తమ తెగకు సంబంధించిన పాటలు పాడుతూ నృత్యాలు చేస్తారు.

పెళ్లి తర్వాత ఇక్కడి తెగ వారు మరో వింత ఆచారాన్ని పాటిస్తుంటారు. భర్త చేతిలో ఓ తాడులాంటి వస్తువుతో భార్యను కొడతాడు. అలా తనకు నచ్చిన రీతిలో, కాస్త సమయం చెలరేగిపోయి భార్యను కొట్టి ఆపేస్తారు. తెగలో కొందరైతే కర్రసాములో పాల్గొని విజేతగా నిలిచిన వారు పెళ్లి చేసుకుని జీవితాన్ని గడుపుతుంటారు. ఓడిన వాళ్లు మరో ఏడాది మళ్లీ ప్రయత్నించి ఏదో రకంగా కొన్ని నియమాలలో విజయం సాధించి వివాహానికి అర్హత సాధిస్తారు.

హమర్ తెగలో వివాహ వయసు పురుషులకు దాదాపు 30 ఏళ్లకు పైగా ఉండగా.. మహిళలకు 17 ఏళ్లు నిండితే చాలు. కాబోయే భార్య కుటుంబానికి వరుడు పెద్ద మొత్తంలో సంపదను ఇచ్చుకోవాల్సి ఉంటుంది. 30 మేకలు లేదా గొర్రెలను అత్తింటివారికి వరుడు సమర్పించుకోవాలి. అయితే చాలావరకూ పురుషులు తమ జీవితకాలంలో చెప్పినమేరకు మేకలు, గొర్రెలను ఇచ్చుకోవడంలో విఫలమవుతుంటారు. ఈ తెగలో భార్యలతే పెత్తనం. వయసులో భర్త పెద్దవాడు కావడం, భార్య యుక్తవయసులో ఉండటమే ఇందుకు కారణమని చెప్పవచ్చు.

 

మరిన్ని వార్తలు