ఇథియోపియా ఆర్మీ చీఫ్‌ హత్య

24 Jun, 2019 05:29 IST|Sakshi
ఆర్మీచీఫ్‌ అంబచ్యూ మెకనెన్‌ (ఫైల్‌), మెకనెన్‌ మృతిపై ప్రభుత్వ టీవీలో మాట్లాడుతున్న ప్రధాని అబిఅహ్మద్‌

అంగరక్షకుడే కాల్చి చంపాడని ప్రభుత్వం వెల్లడి

అంహరలో తిరుగుబాటు యత్నం విఫలం

అదిస్‌ అబాబా: ఇథియోపియా సైన్యాధిపతి సియరే మెకొన్నెన్‌ హత్యకు గురయ్యారు. మెకొన్నెన్‌  అంగరక్షకుల్లో ఒకరు ఆయనను ఇంటిలోనే కాల్చి చంపారని ప్రభుత్వ ప్రతినిధి బిలెనె సియోమ్‌ తెలిపారు. ఈ ఘటన జరగడానికి కొన్ని గంటల ముందు  ఉత్తరాన గల అంహరలో స్వయంప్రతిపత్తి మండలి ప్రభుత్వాన్ని (అటానమస్‌ రీజన్‌)కూల్చివేసేందుకు విఫలయత్నం జరిగిందని, ఆ సందర్భంగా జరిగిన కాల్పుల్లో అంహర అధ్యక్షుడు అంబచ్యూ మెకనెన్‌ చనిపోయారని, పలువురు గాయపడ్డారని ఆమె చెప్పారు. అయితే, ఈ రెండు ఘటనలకు సంబంధం ఉన్నదీ లేనిదీ ఇప్పుడే చెప్పలేమన్నారు.

అంహర రాజధాని బహిర్‌ దార్‌లో శనివారం మధ్యాహ్నం అధ్యక్షుడు అంబచ్యూ ఉన్నతాధికారులతో సమావేశం జరుపుతుండగా, సైన్యాధికారి అసమిన్యూ నాయకత్వంలో కొందరు వారిపై దాడి  చేశారు.  ఆ సందర్భంగా జరిగిన కాల్పుల్లో అంబచ్యూతో పాటు ఆయన సలహాదారుడు కూడా చనిపోయారు .అసమిన్యూ తప్పించుకున్నారని ప్రభుత్వం తెలిపింది.ఈ ఘటన జరిగిన కొన్ని గంటలకు మెకొన్నెన్‌ హత్య జరిగింది. ఆ సమయంలో సైన్యాధిపతితో ఉన్న రిటైర్డ్‌ సైన్యాధికారి కూడా చనిపోయారు. హంతకుడిని అదుపులోకి తీసుకున్నట్టు ప్రభుత్వ ప్రతినిధి తెలిపారు.

గతంలో ప్రభుత్వంపై తిరుగుబాటు చేసినందుకుగాను అసమిన్యూ అరెస్టయ్యారు. గత ఏడాదే క్షమాభిక్ష కింద విడుదలయ్యారని స్థానిక మీడియా పేర్కొంది. రాజధానిలో కొన్ని గంటల పాటు కాల్పులు జరిగాయని విదేశీ జర్నలిస్టు ఒకరు తెలిపారు. విదేశీ దౌత్యవేత్తలు, అంతర్జాతీయ సంస్థలు ఉండే బోలె జిల్లాలో మెకొన్నెన్‌ హత్య జరగడంతో ఆయా దేశాలు తమ సిబ్బందిని అప్రమత్తం చేశాయి. అంహరలో పరిస్థితి ప్రస్తుతం పూర్తిగా అదుపులో ఉందని ప్రధాని కార్యాలయం ప్రకటించింది. జనాభా రీత్యా ఆఫ్రికాలో రెండో పెద్ద దేశమైన ఇధియోపియా ఆర్థికంగా  ఎదుగుతోంది. ఏడాది క్రితం ప్రధాని పగ్గాలు చేపట్టిన అబి అహ్మద్‌ పలు సంస్కరణలు చేపట్టారు. అందులో భాగంగా రాజకీయ ఖైదీలను విడుదల చేశారు. రాజకీయ పార్టీలపై నిషేధాన్ని ఎత్తివేశారు.

మానవ హక్కులను ఉల్లంఘించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకున్నారు. సైన్యానికి, నిఘా విభాగాలకు ఈ సంస్కరణలు రుచించకపోవడంతో వారు ప్రధానికి శత్రువులుగా మారారు. మరోవైపు  అంహరా సహా దేశంలో చాలా ప్రాంతాల్లో తీవ్రమవుతున్న జాతి పోరాటాలు ప్రభుత్వానికి ఇబ్బందులు కలిగిస్తున్నాయి. దేశంలో ఒరోమో, అంహర తెగల ప్రజలు అత్యధికంగా ఉన్నారు. ప్రత్యర్థిపై పోరాటానికి సిద్దంగా ఉండాల్సిందిగా గత వారం అసమిన్యూ అంహర తెగ ప్రజలకు పిలుపునిచ్చారు. దేశంలో అంహర సహా తొమ్మిది అటానమస్‌ రీజన్లు ఉన్నాయి. సరిహద్దు విషయంలో ఈ మండళ్లలో తెగల మధ్య ఘర్షణలు చెలరేగుతున్నాయి. ఏ తెగకు ఆ తెగ స్వపరిపాలనకు డిమాండ్‌ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఘర్షణలు జరుగుతున్నాయి. 

మరిన్ని వార్తలు