ఇథియోపియా ప్రధానికి శాంతి నోబెల్‌

12 Oct, 2019 01:40 IST|Sakshi
ఇథియోపియా ప్రధానమంత్రి అబీ అహ్మద్‌ అలీ

సరిహద్దు దేశమైన ఎరిట్రియాతో శాంతి ఒప్పందానికి చొరవ

స్టాక్‌హోమ్‌: ప్రతిష్టాత్మక నోబెల్‌ శాంతి పురస్కారం ఈ ఏడాది ఇథియోపియా ప్రధానమంత్రి అబీ అహ్మద్‌ అలీని వరించింది. ఆఫ్రికా దేశంలో శాంతి స్థాపన, అంతర్జాతీయ సహకారంలో ఆయన చేసిన కృషికిగాను ఈ అవార్డు దక్కింది. ప్రధానంగా ఇ«థియోపియాకు సరిహద్దుల్లో ఉన్న ఎరిట్రియా దేశంతో దశాబ్దాల తరబడి నెలకొని ఉన్న సరిహద్దు ఉద్రిక్తతల్ని నివారించడానికి శాంతి ఒప్పందం కుదుర్చుకోవడంలో అబీ అహ్మద్‌ చూపించిన చొరవకు గుర్తింపుగా ఈ అవార్డు ప్రకటిస్తున్నట్టుగా ఓస్లోలో నార్వే నోబెల్‌ ఇనిస్టిట్యూట్‌ ప్రకటించింది.

ఇథియోపియా దేశానికి చెందిన వ్యక్తికి అత్యున్నత పురస్కారం రావడం ఇదే మొదటిసారి. 43 ఏళ్ల అబీ నోబెల్‌ పురస్కారం పొందిన 100వ విజేత. ఈ పురస్కారం కింద 90 లక్షల స్వీడిష్‌ క్రౌన్స్‌ (దాదాపు రూ.9.40 కోట్లు) అబీ అహ్మద్‌కు అందజేస్తారు. ఆల్‌ఫ్రెడ్‌ నోబెల్‌ వర్ధంతిని పురస్కరించుకొని డిసెంబర్‌ 10న నార్వేలోని ఓస్లోలో శాంతి పురస్కారాన్ని ప్రదానం చేస్తారు. స్వీడన్‌ పర్యావరణ ఉద్యమకారిణి, 16 ఏళ్ల వయసున్న గ్రేటా థెన్‌బర్గ్‌ రేసులో ముందున్నారు. ఆమెకే అవార్డు వరిస్తుందని అందరూ భావించారు. కానీ చివరి నిమిషంలో అబీ అవార్డును గెల్చుకున్నారు.

20 ఏళ్ల సంక్షోభానికి తెర
ఒకప్పుడు ఇథియోపియాలో భాగమైన ఎరిట్రియా సుదీర్ఘ పోరాటం చేసి 1993లో స్వతంత్ర దేశంగా అవతరించింది. అప్పట్నుంచి ఆ రెండు దేశాల మధ్య సరిహద్దు సమస్యలు ఉన్నాయి. అంతర్జాతీయ ఒప్పందాలను బేఖాతరు చేస్తూ ఎరిట్రియా 1998లో ఇథియోపియాపై సమరభేరి మోగించింది. 1998–2000 మధ్య భీకర పోరులో చివరికి ఎరిట్రియా వెనక్కి తగ్గింది. అప్పట్నుంచి ఉద్రిక్తతలు చెలరేగుతూనే ఉన్నాయి. 2018లో అబీ అహ్మద్‌ ప్రధానమంత్రి పగ్గాలు చేపట్టాక ఎరిట్రియా అధ్యక్షుడు ఇసాయిస్‌ అఫ్వెర్కికు స్నేహహస్తం అందించారు.

మూడు నెలల్లోనే ఉద్రిక్తతల్ని చల్లార్చడానికి శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. దేశంలో ప్రభుత్వ నిబంధనలన్నింటినీ అబీ అహ్మద్‌ సరళీకరించారు. కేబినెట్‌లో అత్యధికంగా మహిళల్ని అబీ అహ్మద్‌ తీసుకున్నారు. పార్టీ పట్ల అసంతృప్తితో ఉన్నవారినీ అక్కున చేర్చుకున్నారు. దేశ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడడానికి సరళీకృత ఆర్థిక విధానాలు ప్రవేశపెట్టారు. పొరుగు దేశాలతో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఏళ్ల తరబడి అభద్రతలో ఉన్న ప్రజల్లో భవిష్యత్‌ పట్ల భరోసాను నింపారు. ఒక ప్రధానిగా అబీ అహ్మద్‌ సయోధ్య, సంఘీభావం, సామాజిక న్యాయం అనే అంశాలను బాగా ప్రచారంలోకి తీసుకువచ్చారు.

అతడే ఒక సైన్యం
ఒక సైనికుడిగా జీవితాన్ని ప్రారంభించి సైబర్‌ ఇంటెలిజెన్స్‌ విభాగంలో సాహసోపేతంగా వ్యవహరించి, ప్రధానిగా శాంతి స్థాపనకు పలు సంస్కరణలు తీసుకువచ్చిన అబీ అహ్మద్‌ ప్రస్థానం ఎంతో ఆసక్తికరం. దక్షిణ ఇథియోపియాలో జిమా జోన్‌లో 1976లో అబీ జన్మించారు. ఆయన తండ్రి ముస్లిం. తల్లి క్రిస్టియన్‌. చదువుల్లో ఎప్పుడూ ముందుండేవారు. చదువుపై ఆసక్తితో ఎన్నో డిగ్రీలు సొంతం చేసుకున్నారు. శాంతిభద్రతల అంశంలో అడ్డీస్‌ అబాబా యూనివర్సిటీ నుంచి డాక్టరేట్‌ పొందారు. లండన్‌లో గ్రీన్‌ విచ్‌ యూనివర్సిటీ నుంచి నాయకత్వ మార్పిడి అనే అంశంలో మాస్టర్స్‌ డిగ్రీ చేశారు.

టీనేజ్‌లో ఉండగానే సైన్యంలో చేరారు. లెఫ్ట్‌నెంట్‌ కల్నల్‌ పదవి వరకు ఎదిగారు ప్రమాదాలు ఎదుర్కొని వాటిని పరిష్కరించడం అయనకు ఎంతో ఇష్టమైన విషయం. 1998–2000 మధ్య ఎరిట్రియాతో యుద్ధ సమయంలో నిఘా విభాగంలో పనిచేశారు. గూఢచారిగా మారి ఎరిట్రియా నుంచి రక్షణకు సంబంధించి పలు రహస్యాలను రాబట్టారు. 1995లో ర్వాండాలో ఐక్యరాజ్యసమితి శాంతి కార్యకర్తగా సేవలు అందించారు. 2010లో రాజకీయాల్లో చేరారు. ఒరోమో పీపుల్స్‌ డెమోక్రటిక్‌ ఆర్గనైజేషన్‌ సభ్యుడిగా చేరి పార్లమెంటుకి ఎన్నికయ్యారు. 2018 ఏప్రిల్‌లో ప్రధాని పగ్గాలు చేపట్టి దేశం దశ దిశ మార్చడానికి కృషి చేస్తున్నారు.

థ్రిల్లింగ్‌గా ఉంది: అబీ  
అత్యంత ప్రతిష్టాత్మకమైన నోబెల్‌ శాంతి పురస్కారం ఇథియోపియా ప్రధాని అబీని వరించడంతో ఆ దేశ ప్రజలు ఆనందోత్సాహాల్లో ఉన్నారు. ఈ పురస్కారం దేశానికే గర్వకారణమని ప్రధాని కార్యాలయం ఒక పత్రికా ప్రకటనలో పేర్కొంది. తనకి ఎంతో థ్రిల్లింగ్‌గా ఉందని అబీ అన్నారు. ఈ పురస్కారం ఆఫ్రికాకే చెందుతుందని చెప్పారు. ఈ అవార్డుతో స్ఫూర్తి పొంది ఆఫ్రికా ఖండంలో ఇతర దేశాల నాయకులు శాంతి స్థాపనకు కృషి చేస్తారని భావిస్తున్నానని ఆశాభావం వ్యక్తం చేశారు. 

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా