‘ఉగ్ర’పోరును ముందుండి నడపాలి

30 May, 2017 00:57 IST|Sakshi
‘ఉగ్ర’పోరును ముందుండి నడపాలి

యూరప్‌ దేశాలకు ప్రధాని మోదీ పిలుపు
► టెర్రరిజంతో ఎక్కువగా నష్టపోతుంది ఆ దేశాలే
► జర్మన్‌ పత్రికకు మోదీ ఇంటర్వ్యూ


బెర్లిన్‌: విశ్వ మానవాళికి ఉగ్రవాదం పెను సవాల్‌గా మారిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఐక్యరాజ్యసమితి నేతృత్వంలో జరుగుతున్న ఉగ్రవాదంపై పోరులో ఐరోపా దేశాలు ప్రధాన పాత్ర పోషించాలని ఆయన కోరారు. నాలుగు దేశాల పర్యటన సందర్భంగా సోమవారం బెర్లిన్‌ చేరుకున్న ప్రధాని జర్మన్‌ ప్రధాన పత్రిక ‘హ్యాడెల్స్‌బ్లాట్‌’కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఐరోపా దేశాలే ఉగ్రవాదం కారణంగా తీవ్రంగా నష్టపోతున్నాయని ఈ ఇంటర్వూ్యలో మోదీ తెలిపారు. ఇటీవలి కాలంలో జర్మనీ, ఫ్రాన్స్, యూకే, స్వీడన్‌ దేశాల్లో ఉగ్రదాడుల నేపథ్యంలో మోదీ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

తాజాగా మాంచెస్టర్‌ (యూకే)లో జరిగిన ఉగ్రదాడిలో 22 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ‘మా దృష్టిలో ఉగ్రవాదం మానవాళికి పెనుముప్పుగా మారింది. దీని వల్ల తీవ్రంగా నష్టపోతున్న ఐరోపా దేశాలు.. ఉగ్రవాదంపై పోరును ముందుండి నడిపించాలి’ అని ప్రధాని పేర్కొన్నారు. వ్యాపారంలో రక్షణాత్మకచర్యలపైనా నిక్కచ్చిగా మాట్లాడారు. ‘ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న సంరక్షణాత్మక వ్యాపార ధోరణి, వలసవాద వ్యతిరేక సెంటిమెంట్లు మమ్మల్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ పర్యటనలో వీటిపై చర్చ జరిగి, పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నా’ అని స్పష్టం చేశారు. అంతర్జాతీయంగా వాణిజ్యం, పెట్టుబడుల ప్రవాహం స్వేచ్ఛగా సాగేలా ఐరోపా దేశాలు చొరవతీసుకోవాలని మోదీ సూచించారు.

ఇంటర్వ్యూలోని ముఖ్యాంశాలు:
మనమంతా పరస్పర అనుసంధాన ప్రపంచంలో జీవిస్తున్నాం. అన్ని దేశాల మధ్య వస్తువులు, పెట్టుబడుల మార్పిడితోపాటు ప్రజల వలసలు సాగితేనే సంయుక్తంగా అభివృద్ధి సాధించగలం. ప్రపంచీకరణ లాభాలను అప్పుడే అందుకోగలం.
⇒  ప్రపంచంలో అత్యంతవేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థలైన భారత్, జర్మనీ దేశాలు పరస్పర సహకారంతో ముందుకెళ్తున్నాయి.
⇒  భారత ప్రభుత్వ మేకిన్‌ ఇండియా, స్కిల్‌ ఇండియా, స్టార్టప్‌ ఇండియా, స్వచ్ఛభారత్, స్మార్ట్‌సిటీస్‌ వంటి పథకాల్లో జర్మనీ కీలకమైన భాగస్వామి.
⇒  ప్రస్తుత వాస్తవ ప్రపంచానికి అనుగుణంగా సంస్కరణాత్మకమైన సంస్థలు ఏర్పడాలి.
ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో సంస్కరణలు రావాలని చాలాకాలంగా కోరుతున్నాం. ఈ మార్పులు వీలైనంత త్వరగా రావాల్సిన అవసరం ఉంది.
అంతర్జాతీయంగా యూరోపియన్‌ యూనియన్‌ పాత్ర కీలకం. ప్రపంచాభివృద్ధి, శాంతి, భద్రతల విషయంలో ఈయూ స్థిరత్వం చాలా కీలకం.
యూకే, యూరోపియన్‌ యూనియన్‌లతో బహుముఖ రంగాల్లో బలమైన బంధాలను మేం గౌరవిస్తాం. వీటిని ఇలాగే కొనసాగిస్తాం.

జర్మనీ చేరుకున్న మోదీ
నాలుగు దేశాల పర్యటన నిమిత్తం మోదీ సోమవారం జర్మనీ చేరుకున్నారు. మంగళవారం జర్మనీ చాన్స్‌లర్‌ ఏంజెలా మెర్కెల్‌తో మోదీ సమావేశమయ్యారు. వాణిజ్యం, పెట్టుబడులు, భద్రత, ఉగ్రవాద వ్యతిరేక కార్యక్రమాలు, శాస్త్ర సాంకేతికత, నైపుణ్యాభివృద్ధి, పట్టణ మౌలిక వసతులు, రైల్వేలు, పౌర విమానయానం, అభివృద్ధిలో సహకారం, ఆరోగ్యం, వంటి అంశాలపై చర్చలు జరపనున్నారు.

స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం, భారత్‌– ఈయూ సంబంధాలు, దక్షిణ చైనా సముద్రంలో పరిస్థితులు, చైనా ప్రతిపాదించిన ఓబీఓఆర్, సవాల్‌ విసురుతున్న ఉగ్రవాదం వంటి అంశాలపైనే మోదీ జర్మనీ పర్యటనలో ప్రధానంగా చర్చ జరగనున్నట్లు సమాచారం. జర్మనీ అధ్యక్షుడు ఫ్రాంక్‌ వాల్టర్‌తో సమావేశం అనంతరం మంగళవారం సాయంత్రం స్పెయిన్‌కు మోదీ బయలుదేరనున్నారు.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా