భారత్‌కు మద్దతిచ్చిన యూరోపియన్‌ పార్లమెంట్‌

18 Sep, 2019 20:04 IST|Sakshi

బ్రస్సెల్‌: కశ్మీర్‌ అంశంలో.. అంతర్జాతీయ సమాజంలో పాక్‌కు అన్ని ఎదురు దెబ్బలే తగులుతున్నాయి. అయినా కూడా పాక్‌ తన వక్ర బుద్ధిని మాత్రం మార్చుకోవడం లేదు. కశ్మీర్‌ పునర్వ్యస్థీకరణ అంశంలో తాజాగా పాక్‌కు మరో ఎదురు దెబ్బ తగిలింది. యూరోపియన్‌ పార్లమెంట్‌ కశ్మీర్‌ విభజన అంశంలో భారత్‌కు మద్దతివ్వడమే కాక పాకిస్తాన్‌ ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తుందని ఆరోపించింది. యూరోపియన్ పార్లమెంటు ప్లీనరీ ప్రత్యేక చర్చ సందర్భంగా బుధవారం పార్లమెంటు సభ్యుల రిస్జార్డ్ జార్నెక్కి, ఫుల్వియో మార్టస్సిల్లో కశ్మీర్ అంశంపై చర్చించారు. పాక్‌పై విమర్శలు చేయడమే కాక భారతదేశానికి పూర్తి మద్దతు ఇచ్చారు. అంతేకాక భారత్‌ గొప్ప ప్రజాస్వామ్య దేశం అని ప్రశంసించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ‘కశ్మీర్‌ అంశంలో మేం భారత్‌కు మద్దతిస్తున్నాం. ఎన్నో ఏళ్లుగా భారత్‌, కశ్మీర్‌ ఉగ్ర దాడులతో నలిగిపోతున్నాయి. ఉగ్రవాదులు ఎక్కడో చంద్రుడి మీద నుంచి రావడం లేదు. పొరుగు దేశం నుంచే వస్తున్నారు. పాక్‌ ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తోంది. ఇస్లామాబాద్‌లో మానవహక్కులను పూర్తిగా కాలరాస్తున్నారు’ అని ఆరోపించారు. అలానే ‘ఈ సందర్భంగా భారత ప్రభుత్వానికి మేం చెప్పేది ఒక్కటే. కశ్మీర్‌లో సాధారణ పరిస్థితులు తీసుకువచ్చేందుకు కృషి చేయండి. లోయలో ఫోన్‌, ఇంటర్నెట్‌ వంటి కమ్యూనికేషన్‌ మార్గాలను పునరుద్ధరించాలని’ కోరారు.
(చదవండి: భారత్‌తో యుద్ధంలో ఓడిపోతాం)

మరిన్ని వార్తలు