పెరుగుతున్న ఇ-వ్యర్థాలతో ముప్పు తప్పదంటున్న శాస్త్రవేత్తలు

31 Jan, 2019 16:07 IST|Sakshi

ఏటా కాలం తీరిన ఎలక్ట్రానిక్‌ పరికరాలను వందల టన్నుల్లో పడేస్తున్నాం. ఫలితంగా ఇ-వ్యర్థాలు గుట్టలా పేరుకుపోతున్నాయి. ఇలా నిరుపయోగంగా మారిన ఇ-వేస్ట్‌తో సంవత్సరానికి దాదాపు 4,500 ఈఫిల్‌ టవర్లను నిర్మించవచ‍్చట. అంతేనా ఇలా పోగుపడిన ఇ - వేస్ట్‌ బరువు ఏకంగా 1,25,000 బోయింగ్‌ 747 జంబో జెట్ల బరువుకు సమానమట. ఇవేవో గాలి కబుర్లు కావు. స్వయంగా దావోస్‌ వేదికగా నిర్వహించిన ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్‌) వార్షిక సదస్సులో ఈ నివేదికను వెల్లడించారు. అవును మరి ప్రస్తుతం చేతిలో స్మార్ట్‌ఫోన్‌.. ఇంట్లో టీవీలు, వాషింగ్‌ మెషిన్‌లు, ఫ్రిజ్‌లు.. ఆఫీసుల్లో ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లు.. ఇవే కాక బయట మరో సవాలక్ష ఎలక్ట్రానిక్‌ పరికరాలు. ఇవి లేకపోతే మనకు నిమిషం కూడా గడవని పరిస్థితి.

ఉపయోగాలు లేవని కాదు.. అతి వాడకం. వెరసి రోజురోజుకు పెరిగిపోతున్న ఇ-వ్యర్థాలు. వీటిని పునరుపయోగించడం చాలా కష్టమైనదే  కాక ఖర్చుతో కూడుకున్న ప్రక్రియ. ఇన్నాళ్లు గ్లోబల్‌ వార్మింగ్‌ గురించి ఆందోళన చెందితే.. ఇప్పుడు ఇ-వ్యర్థాలు మరింత భయపెడుతున్నాయి. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా పోగవుతున్న వ్యర్థాల్లో ఇ-వేస్ట్‌ వాటా కేవలం 2 శాతం మాత్రమే. కానీ పర్యావరణానికి కలిగించే హానిలో వీటి వాటా మాత్రం ఏకంగా 70 శాతం అంటే ఇ-వేస్ట్‌ ఎంత ప్రమాదకరమో అర్థం చేసుకోవచ్చు. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో ఈనెల 21 నుంచి ఐదు రోజుల పాటు జరిగిన డబ్ల్యూఈఎఫ్‌ వార్షిక సదస్సులో ఈ ఇ-వ్యర్థాల గురించి చర్చించారు. పెరిగిపోతున్న ఇ-వేస్ట్‌ను తగ్గించేందుకు తీసుకునే చర్యలే కాక.. సులభంగా రీసైకిల్‌ చేసి రీయూజ్‌ చేసే మార్గాల గురించి పరిశోధనలు పెంచాలని నిర్ణయించారు.

ఆ వివరాలు..

సాంకేతికతో పాటే పెరుగుతున్న వ్యర్థాలు..
శాస్త్ర విజ్ఞానం అభివృద్ధి చెందిన కొద్ది.. కొత్త కొత్త ఎలక్ట్రానిక్‌ పరికరాల వినియోగం కూడా పెరుగుతుంది. 2017 నాటికి ప్రపంచవ్యాప్తంగా 1.46 బిలియన్ల స్మార్ట్‌ఫోన్‌లు ఉంటే.. 2020నాటికి స్మార్ట్‌ఫోన్లు వినియోగించే వారి సంఖ్య 2.87 బిలియన్లకు చేరనుందట. ఇంతమందికి మొబైల్‌ ఫోన్‌ సౌకర్యాలు కల్పించాలంటే సెల్‌ టవర్ల సంఖ్య కూడా పెంచాలి. అంటే నెట్‌వర్కింగ్‌ పరికరాలను కూడా పెంచాలి. అయితే ఇక్కడ గమనించాల్సిన ముఖ్య విషయం ఏంటంటే ఎంత టెక్నాలజీ పెరిగితే అంత ఎక్కువ మొత్తంలో ఇ-వేస్ట్‌ కూడా పెరుగుతుంది. ఎందుకంటే ఈ రోజు మనం వాడే ప్రతి ఎలక్ట్రాననిక్‌ పరికరం ఏదో ఒక రోజు నిరుపయోగంగా మారుతుంది. ఫలితం ప్రస్తుతం ఉన్న చెత్తను తగ్గించకపోగా.. మరికొంత పెంచుతున్నట్లే కదా.

చెత్త ‘బంగార’మే..
చెత్త బంగారం ఏంటి అనుకోకండి. ఇ-వ్యర్థాలు నిజంగా బంగారు కొండలే. మనం వాడే స్మార్ట్‌ఫోన్‌ల తయారీలో చాలా తక్కువ మొత్తంలో బంగారం వాడతారనే విషయం తెలిసిందే. 100 టన్నుల బంగారు ధాతులో లభించే బంగారం కంటే.. 100 టన్నుల స్మార్ట్‌ఫోన్‌లలో లభించే బంగారం ఎక్కువ అంటే నమ్మగలరా?.. కానీ నమ్మక తప్పదు. వీటిలో​ బంగారం మాత్రమే కాక వెండి, రాగి, ప్లాటినం, పల్లాడియం వంటి విలువైన లోహాలు ఉంటాయి. వీటిని సరిగా సేకరించే వీలు లేకపోవడం వల్ల ఏటా దాదాపు 4,35,000 టన్నుల మొబైల్‌ ఫోన్లను చెత్త కుప్పలో పడేస్తున్నాం.

రీసైకిల్‌తో మంచి ఆదాయం..
ఇ-వ్యర్థాలు నుంచి విలువైన లోహాలను వేరు చేయడం ఇప్పటికే పెద్ద బిజినెస్‌గా మారింది. ప్రతి ఏడాది ఇ వేస్ట్‌ను రీసైకిల్‌ చేయడం ద్వారా 62.5 బిలియన్ల సంపద లభిస్తుంది. ఈ మొత్తం కొన్ని దేశాల జీడీపీకి సమానం. అయితే ఇ వ్యర్థాల నుంచి లోహాలను వేరు చేయడం అంత తెలికైన పనేం కాదు. ఇందుకు ఎంతో ఖర్చుతో పాటు​ శ్రమ కూడా అవసరం. ఎందుకంటే వీటిల్లో బంగారం, ప్లాటినం వంటి విలువైన లోహాలతో పాటు పాదరసం, లెడ్‌, కాడ్మియం వంటి హానికారక పదర్ధాలు కూడా ఉంటాయి. కాబట్టి రీసైకిలింగ్‌ అనేది సరైన పద్దతిలో.. సరైన సౌకర్యాల మధ్య జరగకపోతే.. పర్యావరణానికే కాక మనుషులకు కూడా హాని కల్గించే అవకాశం ఉంది.

అయితే ఇప్పటికే కొన్ని యూరోపియన్‌ యూనియన్‌ సభ్య దేశాలు ఎటువంటి అనుమతుల్లేకుండా ఈ ఇ-వేస్ట్‌ను ఎగుమతి చేసుకుంటున్నాయి. అంతేకాక చాలా ప్రమాదకర పరిస్థితుల్లో ఈ వ్యర్థాలను రీసైకిల్‌ చేస్తున్నారు. కేవలం నైజిరియాలోనే దాదాపు లక్ష మంది ఈ ప్రమాదకర ఇ-వేస్ట్‌ రీసైకిలింగ్‌ యూనిట్లలో పని చేస్తున్నారు. అంటే వీరందరి బతకడం కోసం ప్రమాదంతో సావాసం చేస్తున్నారు. రీసైకిలింగ్‌లో భాగంగా చాలా పెద్ద మొత్తంలో ఇ-వ్యర్థాలను మండించడం వల్ల చాలా విషపూరిత వాయువులు వెలువడుతున్నాయి. ఫలితంగా పర్యావరణమే కాక అక్కడ ఉన్న కార్మికులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

నివారణ మార్గాలు..
ఇ-వ్యర్థాల వల్ల పెరుగుతున్న కాలుష్యాన్ని, ఆరోగ్య సమస్యలను తగ్గించాలంటే ఒకటే మార్గం. సరైన రీతిలో వీటిని రీసైకిల్‌ చేయడం. ఇ-వేస్ట్‌ను తగ్గించాలంటే ముందుగా ప్రస్తుతం వాడుతున్న ఎలక్ట్రానిక్‌ పరికరాల తయారీని సమూలంగా మార్చాలి. త్వరగా పాడయ్యే పరికరాల కన్నా ఎక్కువ కాలం మన్నే వస్తువులను తయారు చేయ్యాలి. అంతేకాక ఒక్కసారి వాటి లైఫ్‌ టైమ్‌ పూర్తయ్యాక వాటిని సులువుగా, భద్రంగా రీసైకిల్‌ చేసే విధంగా డిజైన్‌ చేయాలి. తయారిదారుడు, అమ్మకందారుడు ఇద్దరు ఈ ఇ వ్యర్థాలను తగ్గించే బాధ్యతను తీసుకోవాలి. అందుకే బై బ్యాక్‌ స్కీమ్‌లను తీసుకురావాలి. అస్సెట్‌ - ఓనర్‌షిప్‌ వ్యవస్థ నుంచి సర్వీస్‌ - సబ్‌స్ర్కిప్షన్‌ వ్యవస్థకు మార్చాలి. అంతేకాక పరికరాలను ఒక నిర్దిష్ట కాలానికి లీజ్‌కిచ్చే విధానాలను తీసుకురావాలి. వీటినే మళ్లీ రీసైకిల్‌ చేసి తిరిగి వాడుకునేందుకు వీలుగా మార్చాలి.

మరిన్ని వార్తలు