నానో.. అన్నీ సాధ్యమే

19 Mar, 2018 01:42 IST|Sakshi

 కార్బన్‌ నానో ట్యూబ్‌లతో భారీ ఫిల్టర్‌ రూపొందించిన ‘మ్యాటర్‌షిఫ్ట్‌’

ఫిల్టర్‌లో ఒక చదరపు మీటర్‌కు 250 లక్షల కోట్ల నానో ట్యూబ్‌లు!

దీనితో అసాధ్యాలన్నీ సుసాధ్యమంటున్న అమెరికా కంపెనీ

అతి చవకగా ఉప్పు నీటిని మంచినీటిగా మార్చుకోవచ్చు

గాల్లోని కార్బన్‌డయాక్సైడ్‌ను పెట్రోలు, డీజిల్‌గా మార్చుకోవచ్చు

మ్యాటర్‌షిఫ్ట్‌ ఆవిష్కరణతో ఇంకెన్నో ప్రయోజనాలు: నిపుణులు

గాల్లోని కార్బన్‌డయాక్సైడ్‌.. పెట్రోలు, డీజిల్‌గా మారిపోతే.. సముద్రపు ఉప్పునీరు చిటికెలో మంచినీరైపోతే.. మందుల ఫ్యాక్టరీ మొత్తం చిన్న పెట్టెలో ఇమిడిపోతే.. ఇవన్నీ అతి తక్కువ ఖర్చుతో ఏమాత్రం శ్రమ లేకుండా జరిగిపోతే.. అంతా బాగానే ఉందిగానీ ఇదంతా జరిగేపనేనా అనుకుంటున్నారా.. ఇంకొన్నేళ్లు ఆగండి.. నానో టెక్నాలజీతో జరిగే ఆ అద్భుతాలు చూసి ‘వావ్‌’.. అనక మానరు! ఒకప్పుడు అసాధ్యమనుకున్న పనులు ఇకపై చాలా సింపుల్‌గా జరుగుతాయని చెబుతోంది అమెరికా కంపెనీ మ్యాటర్‌షిఫ్ట్‌!. ఈ మధ్యే వీళ్లు కార్బన్‌ నానో ట్యూబ్‌లతో ఓ ఫిల్టర్‌ తయారు చేశారు. దీన్నిగాని వాడారంటే.. ఈ భూమ్మీద పరిష్కరించలేని సమస్య అంటూ ఉండదని చెబుతున్నారు. అబ్బో.. అంతగొప్పదా ఈ ఫిల్టర్‌.. అనుకుంటున్నారా? వివరంగా తెలుసుకోండి.. తర్వాత మీరే అంటారు.. ‘అబ్బో’ అని!!     – సాక్షి హైదరాబాద్‌ 

ఏమిటీ కార్బన్‌ నానో ట్యూబ్‌!
కార్బన్‌ నానో ట్యూబ్‌.. క్లుప్తంగా చెప్పుకుంటే అతి సూక్ష్మమైన గొట్టం. ఎంత సూక్ష్మమంటే.. వెంట్రుకలో యాభై వేల నానో ట్యూబ్‌లు ఇమిడిపోతాయి. వజ్రాల మాదిరి కార్బన్‌తో తయారవుతుంది కాబట్టి ఈ గొట్టాలు దృఢంగా ఉంటాయి. సూక్ష్మాతి సూక్ష్మం కాబట్టి వీటి ద్వారా నిర్దిష్ట పరిమాణంలోని అణువులే ప్రయాణించగలవు. ఇన్ని మంచి లక్షణాలున్నా ఈ ట్యూబ్‌ల తయారీలో ప్రధానమైన చిక్కుంది. భారీ సైజులో తయారు చేయడం చాలా కష్టం. అందుకే ఇప్పటివరకూ చాలా మంది శాస్త్రవేత్తలు పరిమిత స్థాయిలోనే తయారు చేసి.. వాటితో చేయగల అద్భుతాల గురించి చెబుతూ వచ్చారు. మ్యాటర్‌షిఫ్ట్‌ కంపెనీ మాత్రం ఈ ఇబ్బందులన్నీ అధిగమించింది. ఫలితంగా కార్బన్‌ నానో ట్యూబ్‌ల ఫిల్టర్లను భారీ సైజులో తయారు చేయడం మొదలుపెట్టింది. ఇళ్లల్లో నీటి శుద్ధి కోసం రివర్స్‌ ఆస్మాసిస్‌ ఫిల్టర్లు వాడుతూంటాం కదా.. కార్బన్‌ నానో ట్యూబ్‌ ఫిల్టర్లూ అచ్చం ఇలాగే ఉంటాయి.

పిసరంత స్థలంలో కోట్లకు కోట్లు
మ్యాటర్‌ షిఫ్ట్‌ తయారు చేస్తున్న ఫిల్టర్లలో ఎన్ని కార్బన్‌ నానో ట్యూబ్‌లు ఉంటాయో తెలుసా? ఒక్కో చదరపు మీటర్‌లో 250 లక్షల కోట్లు! కార్బన్‌ నానో ట్యూబ్‌లను మనకు కావల్సిన విధంగా డిజైన్‌ చేసుకోవచ్చు. ఈ డిజైన్ల ద్వారా ఉప్పు నీటిని మంచినీటిగా మార్చుకోవడం మొదలు ఎక్కడికక్కడ మందులు తయారు చేసుకోవడం వరకూ అనేక రకాల పనులకు వాడుకోవచ్చు. ఈ గొట్టాల చివర ఇతర పరమాణువులు అతికించి ఇతర ప్రయోజనాలూ పొందొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. నానో టెక్నాలజీ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చేందుకు మ్యాటర్‌ షిఫ్ట్‌ ఆవిష్కరణ ఉపయోగపడుతుందని చెబుతున్నారు. కార్బన్‌ నానో ట్యూబ్‌ల ఫిల్టర్లు అణుస్థాయిలో ఫ్యాక్టరీలుగా పనిచేస్తూ కొత్త, వినూత్న పదార్థాలను తయారు చేయగలవంటున్నారు.

ఏమేం చేయొచ్చంటే..
కార్బన్‌ నానో ట్యూబ్‌ ఫిల్టర్లతో సాధ్యం కాని పనంటూ ఏదీ లేదని ముందే చెప్పుకున్నాం. ప్రస్తుతానికి మాత్రం గాల్లోంచి కార్బన్‌డయాక్సైడ్‌ పీల్చుకొని పెట్రోలు, డీజిల్‌ లాంటి ఇంధనాలుగా మార్చేందుకు మ్యాటర్‌షిఫ్ట్ట్‌ ప్రయత్నాలు మొదలెట్టింది. ఇంకో ఆసక్తికర విషయమేంటంటే.. పీల్చుకున్న కార్బన్‌డయాక్సైడ్, ఇతర లవణాలను త్రీడీ ప్రింటింగ్‌ టెక్నాలజీ సాయంతో భవనాల నిర్మాణానికి పనికొచ్చే పదార్థాలుగా కూడా మార్చవచ్చు. ఆస్పత్రులు, ఇతర అవసరమైన ప్రదేశాల్లో గాల్లోంచే ఆక్సిజన్‌ను వేరుచేసి వాడుకునేందుకు వీలవుతుంది. భారీ లోహాలు, ప్రమాదకర రసాయనాలున్న మట్టినీ సులువుగా శుద్ధి చేయొచ్చు. ముఖ్యంగా అత్యంత చవకగా సముద్రపు నీటిని మంచినీటిగా మార్చేయొచ్చు. ‘నిర్లవణీకరణ’ అనే ఈ ప్రక్రియ చవకగా జరిగితే ప్రపంచవ్యాప్తంగా అనేక వివాదాలు పరిష్కారమవుతాయని తెలిసిందే. ప్రస్తుత పద్ధతుల కంటే కనీసం 4 రెట్లు తక్కువ ఖర్చు నిర్లవణీకరణకు అవుతుందని అంచనా. 

చవకైన, మెరుగైన వైద్యానికి..
కార్బన్‌ నానో ట్యూబ్‌ ఫిల్టర్లను చవకైన, మెరుగైన వైద్యానికి ఉపయోగించుకోవచ్చు. యాంటీబాడీలను వేరు చేయడం మొదలు ఎక్కడికక్కడ మందుల తయారీకి వీటిని వాడుకోవచ్చు. ఒక్కో కార్బన్‌ నానో ట్యూబ్‌లో సూక్ష్మస్థాయిలో మందులు నింపి అవసరమైన చోటే విడుదలయ్యేలా చేయొచ్చు. ప్రస్తుతం మనం ఉపయోగిస్తున్న లిథియం అయాన్‌ బ్యాటరీలతో మరింత ఎక్కువ ప్రయోజనం పొందేందుకూ వీటిని వాడుకోవచ్చు. మనిషి ఇతర గ్రహాలపై జీవించాల్సి వస్తే అక్కడ కూడా ఈ టెక్నాలజీ అన్ని రకాలుగా ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

మరిన్ని వార్తలు