‘వాళ్ల అమ్మ రమ్మంటేనే వెళ్లాను.. తను చాలా మంచిది’

27 Dec, 2018 18:29 IST|Sakshi
లతీఫాతో మేరీ రాబిన్‌సన్‌

గత కొన్ని రోజులుగా కనిపించకుండా పోయిన దుబాయ్‌ యువరాణి షికా లతీఫా ఇంటికి చేరుకున్నారన్న విషయం స్పష్టమైంది. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మాజీ హైకమిషనర్‌, ఐర్లాండ్‌ మాజీ అధ్యక్షురాలు మేరీ రాబిన్‌సన్‌తో కలిసి లతీఫా భోజనం చేస్తున్న ఫొటోలను యూఏఈ అధికారులు ఇటీవల విడుదల చేశారు. ఈ నేపథ్యంలో లతీఫా మానసిక స్థితి గురించి రాబిన్‌సన్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

గురువారం బీబీసీ రేడియో కార్యక్రమంలో మాట్లాడుతూ...‘ తమ కూతురు లతీఫా గురించి మాట్లాడాలని చెప్పి... దుబాయ్‌ రాజు షేక్‌ మహమ్మద్‌ బిన్‌ రషీద్‌ అల్‌ మకతూమ్‌ భార్య హయా నన్ను వాళ్లింటికి ఆహ్వానించారు. కుటుంబ సమస్య గురించి చర్చించాలని చెప్పారు. నేను గమనించినంత వరకు లతీఫా దుర్భల మనస్తతత్వం కలది. అందుకే చాలా ఇబ్బందులు పడుతోంది. మొదట కుటుంబాన్ని విడిచి పారిపోవాలనుకుంది. కానీ ఇప్పుడు అందుకు తను పశ్చాత్తాపపడుతోంది. నేను తనతో కలిసి లంచ్‌ చేశాను. తను స్నేహ స్వభావం గల వ్యక్తి. అయితే ఆమెకు మానసిక చికిత్స చేయించాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం తనకు సంబంధించిన ఏ విషయాన్నైనా ప్రపంచంతో పంచుకోవడానికి లతీఫా కుటుంబం సిద్ధంగా లేదు’  అని వ్యాఖ్యానించారు.

కాగా యువరాణిగా పుట్టినందుకు స్వేచ్ఛ లేదని, రాచకుటుంబ ఆంక్షల చట్రం నుంచి బయటపడి, అమెరికాలో ఆశ్రయం పొందాలనుకున్న లతీఫా ప్రయత్నాలు బెడిసికొట్టిన సంగతి తెలిసిందే. విదేశాల్లో జీవించాలనుకున్న లతీఫా.. ఫిన్‌ల్యాండ్‌కు చెందిన తన స్నేహితురాలు తినా జౌహానియన్, ఫ్రాన్స్‌కు చెందిన కెప్టెన్‌ హెర్వ్‌ జాబెర్ట్‌ , మరో ముగ్గురు సిబ్బందితో కలిసి ఒక మరపడవలో గత ఫిబ్రవరిలో దుబాయ్‌ అధికారుల కళ్లుగప్పి పారిపోయారు. వారు ప్రయాణిస్తున్న పడవ మార్చి14న భారత్‌లోని గోవా జలాల్లో ప్రవేశించింది. ఆ సమయంలో గోవాలోని భారత్‌ తీర ప్రాంత రక్షక దళం బలవంతంగా ఆ పడవలోకి ఎక్కి తుపాకులు చూపించి అందరినీ బెదిరించారని, యువరాణి షికా లతీఫాను బంధించి అప్పుడే  హెలికాప్టర్‌లో అక్కడికి చేరుకున్న యూఏఈ అధికారులకు అప్పగించారని వార్తలు ప్రచారమయ్యాయి. ఈ క్రమంలో తన తండ్రి వేధింపులు భరించలేక పారిపోతున్నానని లతీఫా గతంలో రికార్డు చేసిన వీడియోను బ్రిటన్‌కు చెందిన మీడియా సంస్థ వెలుగులోకి తెచ్చింది.

సోషల్‌ మీడియాలో హల్‌చల్‌
‘నాకు స్వేచ్ఛ లేదు. సంకెళ్ల మధ్య జీవితాన్ని గడుపుతున్నాను. ఎక్కడికి వెళ్లినా నా వెంట ఒకరు ఉంటారు. నా కదలికల్ని అనుక్షణం గమనిస్తుంటారు. 2002లో కూడా ఒకసారి పారిపోవడానికి ప్రయత్నించా. కానీ సరిహద్దుల్లోనే నన్ను పట్టుకున్నారు. మూడేళ్ల పాటు గాలి, వెలుతురు కూడా రాని జైలులో పడేశారు. నా తండ్రికి కీర్తి ప్రతిష్టలంటే ఎనలేని మోజు. దాని కోసం ఎంతకైనా తెగిస్తాడు. మీరు ఈ వీడియో చూసే సమయానికి అయితే నేను చనిపోయి ఉంటాను. లేదంటే చాలా దుర్భరమైన పరిస్థితుల్లో ఉంటాను. బహుశా ఇదే నా ఆఖరి వీడియో‘ అంటూ లతీఫా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఆశ్రయం కోరి వచ్చిన లతీఫాను తిరిగి యూఏఈ పంపించడం ద్వారా భారత్‌ మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడిందని హక్కుల సంస్థ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ ఆరోపించింది. ఈ విషయంపై సమగ్ర విచారణ జరిపించాలని కేంద్రప్రభుత్వాన్ని కోరడంతో పాటుగా.. షికా లతీఫా ఎక్కడుందో బయట పెట్టి, ఆమె స్వేచ్ఛగా జీవించేలా చర్యలు తీసుకోవాలంటూ యూఏఈని డిమాండ్‌ చేసింది.

మరిన్ని వార్తలు