వ్యాయామంతో జ్ఞాపకశక్తి

5 Aug, 2016 03:28 IST|Sakshi

రోజూ వ్యాయామం చేయడం వల్ల ఆరోగ్యంగా ఉంటామనేది తెలిసిన విషయమే. అయితే దీనివల్ల మన జ్ఞాపకశక్తి కూడా మెరుగుపడుతుందనే విషయం తెలుసా! అమెరికాలోని టెక్సాస్ ఏ అండ్ ఎం కాలేజ్ ఆఫ్ మెడిసిన్ శాస్త్రవేత్తలు తాజాగా జరిపిన పరిశోధనల్లో ఈ విషయం తెలిసింది.వ్యాయామం ఫలితంగా మెదడులోని కీలక ప్రాంతంలో ఎప్పటికప్పుడు కొత్త నాడీకణాలు పుట్టుకొస్తాయని, దీంతో పాత విషయాలను గుర్తుం చుకునే సామర్థ్యం పెరుగుతుందని భారత సంతతికి చెందిన శాస్త్రవేత్త అశోక్ శెట్టి పేర్కొన్నారు.

రెండేళ్ల క్రితం తాము ఓ రకమైన ఎలుకలపై ప్రయోగాలు జరపగా, మెదడులోని హిప్పోకాంపస్ ప్రాంతంలో ఎక్కువ స్థాయిలో కొత్త నాడీ కణాలు ఏర్పడ్డాయని, అయితే ఆ ఎలుకలు అప్పటి వరకు నేర్చుకున్న అంశాలను మరిచిపోయినట్లు తమ పరిశోధనల్లో తేలిందని వివరించారు. దీంతో మరోరకమైన ఎలుకలపై ప్రయోగాలు చేయగా, వీటిల్లో ఎలాంటి ప్రతికూల ఫలితాలు రాలేదని తెలిపారు. వ్యాయామాలు చేస్తే జ్ఞాపక శక్తి తగ్గుతుందనే వారికి తాజా పరిశోధనలు స్వాంతన చేకూరుస్తాయని వివరించారు.
 

మరిన్ని వార్తలు