అఫ్గానిస్తాన్‌లో భారత్ కాన్సులేట్పై దాడి

4 Jan, 2016 03:04 IST|Sakshi
అఫ్గానిస్తాన్‌లో భారత్ కాన్సులేట్పై దాడి

అఫ్గానిస్తాన్‌లోని మజార్-ఇ-షరీఫ్ నగరంలో గల భారత దౌత్యకార్యాలయంపై ఆదివారం రాత్రి (భారత కాలమానం ప్రకారం రాత్రి 11 గంటల సమయంలో) ఉగ్రవాదులు దాడికి దిగారు. బాంబు పేలుళ్లు, తుపాకీ కాల్పులతో కార్యాలయ భవనంలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. అఫ్గాన్ ఉత్తర ప్రాంతంలో గల మాజర్-ఇ-షరీఫ్ నగరంలోని దౌత్య కార్యాలయంలో ముగ్గురు భారతీయ సిబ్బంది ఉన్నారు. కార్యాలయ సిబ్బంది అంతా క్షేమంగా ఉన్నారని అక్కడి భారత కాన్సుల్ జనరల్  బి.సర్కార్ తెలిపారు. పొరుగున ఉన్న భవనం నుంచి సాయుధ దుండగులు కాల్పులు జరిపారని.. కార్యాలయ భద్రతా సిబ్బంది ఎదురు కాల్పులతో తిప్పికొట్టారని ఆయన వివరించారు.

అయితే.. తమపై దాడి జరుగుతోందని, ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయని కార్యాలయంలోని భారతీయ అధికారి ఒకరు పేర్కొన్నారు. అఫ్గాన్‌లో దౌత్యకార్యాలయంపై దాడిని నిర్ధారించిన భారత విదేశీ వ్యవహారాల శాఖ.. దానికి సంబంధించిన వివరాలు ఇంకా అందాల్సి ఉందని చెప్పింది. అయితే.. నలుగురు ఉగ్రవాదులు బాంబులు, తుపాకులతో దాడికి పాల్పడ్డారని.. వారిలో ఇద్దరిని భద్రతా బలగాలు ఎదురు కాల్పుల్లో హతమార్చాయని టీవీ చానళ్లలో వార్తలు వెలువడ్డాయి.

మరో ఇద్దరు పరారయ్యారని, వారు సమీపంలోని ఒక భవనంలో దాక్కున్నారని.. వారిపై అఫ్గాన్ దళాలు కాల్పులు కొనసాగిస్తున్నాయని ఆ కథనాలు తెలిపాయి. భారతదేశంలోని పఠాన్‌కోట్ వైమానిక స్థావరంపై ఉగ్రవాదులు దాడికి దిగగా.. వారితో దాదాపు 40 గంటలుగా భద్రతాదళాల పోరాటం కొనసాగుతుండగానే మరోవైపు అఫ్గాన్‌లో భారత దౌత్యకార్యాలయంపై ఉగ్రవాదులు దాడికి దిగటం నిర్ఘాం తపరుస్తోంది. అదీగాక.. ప్రధానమంత్రి నరేం ద్రమోదీ అఫ్గానిస్తాన్‌లో పర్యటించి వచ్చిన వారం రోజుల్లోనే అక్కడి భారత దౌత్యకార్యాలయంపై దాడి జరగటం గమనార్హం. 2008, 2009, 2013, 2014 సంవత్సరాల్లో కూడా కాబూల్‌లోని భారత రాయబార కార్యాలయం పై ఉగ్రవాద దాడులు జరిగాయి. 2013 నాటి ఆత్మాహుతి దాడిలో ఏడుగురు చిన్నారులు సహా 9 మంది పౌరులు చనిపోయారు.

మరిన్ని వార్తలు