ఫేస్‌ యాప్‌.. బాప్‌రే బాప్‌

21 Jul, 2019 01:18 IST|Sakshi

మీ ఫొటోను ఇష్టమొచ్చినట్టు వాడేసుకుంటామని మీతో ఎవరైనా అంటే ఏం చేస్తారు? ఠాట్‌.. అస్సలు కుదరదు అంటారు. అయినా అవతలి వాళ్లు ఇవన్నీ లెక్కచేయకపోతే? ఏముంది.. ఫేస్‌యాప్‌ తరహా వివాదం ఏర్పడుతుంది! 

ఫేస్‌యాప్‌.. గత వారం రోజులుగా ప్రపంచమంతా మార్మోగుతున్న స్మార్ట్‌ఫోన్‌ అప్లికేషన్‌ పేరు ఇది. మీరో సెల్ఫీ దిగి ఈ యాప్‌లో పెడితే అది మీ ఫొటోను ఎడిట్‌ చేసి మీరు ముసలివాళ్లయ్యాక ఎలా ఉంటారో చూపిస్తుంది. అంతేదా.. సరదాగా ఉంటుంది. ఓసారి ప్రయత్నించి చూద్దాం అని మీరు అనుకుంటే మాత్రం సమస్యలు తప్పవంటున్నారు నిపుణులు. ఫేస్‌యాప్‌ ప్రైవసీ అంశాల నిబంధనలే ఇందుకు కారణమని చెబుతున్నారు. రష్యాకు చెందిన వైర్‌లెస్‌ ల్యాబ్‌ అనే సంస్థ అభివృద్ధి చేసిన ఫేస్‌యాప్‌ను మనం వాడటం అంటే.. మన ఫొటోలతోపాటు ఇతర సమాచారం మొత్తం ఆ కంపెనీ చేతుల్లో పెట్టడమే. ఆ కంపెనీ మీ సమాచారాన్ని ఎలాగైనా, ఎప్పుడైనా, ఎవరితోనైనా పంచుకునేందుకు మీరు అంగీకరించడమే. ఇలాంటి ప్రైవసీ నిబంధనలు ఇతర యాప్‌లలోనూ ఉన్నప్పటికీ మనకు ఇష్టం లేకపోతే ఆ సమాచారాన్ని తొలగించుకునే అవకాశం ఉంటుంది.

ఫేస్‌యాప్‌తో మాత్రం ఇలా కుదరదు. ఒక్కసారి వాడామా.. ఇక జీవితకాలం ఆ సమాచారం ఆ కంపెనీ సొత్తు! వాస్తవానికి ఫేస్‌యాప్‌ అప్లికేషన్‌ అందుబాటులోకి వచ్చి రెండేళ్లు అవుతోంది. మనం వృద్ధులుగా మారితే ఎలా ఉంటుందో చూపే ఫీచర్‌ అప్పటి నుంచే ఉంది కూడా. న్యూరల్‌ నెట్‌వర్క్స్‌ అనే ఆధునిక టెక్నాలజీ సాయంతో జరిగే ఈ ప్రక్రియ మాటెలా ఉన్నా గత వారం రోజుల్లోనే దీనికి విపరీతమైన ప్రాచుర్యం లభించేందుకు మాత్రం చక్‌ షూమర్‌ అనే అమెరికా సెనెటర్‌ కారణమయ్యారు. ఫేస్‌యాప్‌లోని ప్రైవసీ నిబంధనలపై అందరూ జాగ్రత్త వహించాలని హెచ్చరిస్తున్నారు. ట్రంప్‌ ప్రభుత్వం ఈ అంశంపై విచారణ చేపట్టాలని కూడా ఆయన డిమాండ్‌ చేస్తున్నారు. వైర్‌లెస్‌ ల్యాబ్‌ రష్యాకు చెందింది కావడం.. అమెరికన్ల సమాచారాన్ని (ఫొటో, లొకేషన్‌ వంటివి) సేకరిస్తుండటం వల్ల భవిష్యత్తులో ఈ సమాచారం ప్రత్యర్థి దేశాలకు చేరితే ప్రమాదమని షూమర్‌ అంటున్నారు. అమెరికన్‌ ఎన్నికలను ప్రభావితం చేసేలా పనిచేసిందన్న కేంబ్రిడ్జ్‌ అనలిటిక్స్‌ సంస్థపై చెలరేగిన దుమారం సద్దుమణగక ముందే సోషల్‌ మీడియాపై ఇలాంటి మరో ఆరోపణ రావడం గమనార్హం.

కంపెనీ ఏమంటోంది?
వినియోగదారులు ఎంపిక చేసిన ఫొటోలనే తాము న్యూరల్‌ నెట్‌వర్క్స్‌ సాయంతో ఎడిట్‌ చేసి పంపుతున్నామని, ఈ వ్యవహారం మొత్తం క్లౌడ్‌ కంప్యూటర్లలో జరుగుతున్న కారణంగా ఫొటోలు కొద్దికాలం అక్కడ నిల్వ ఉండొచ్చని వైర్‌లెస్‌ ల్యాబ్‌ అంటోంది. టెక్‌ క్రంచ్‌ అనే వెబ్‌సైట్‌తో సంస్థ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ ప్రతి 48 గంటలకు తాము సర్వర్ల నుంచి ఫొటోలను తొలగిస్తుంటామని స్పష్టం చేసింది. పైగా అందరూ అనుకుంటున్నట్లు తాము రష్యాకు చెందిన క్లౌడ్‌ సర్వర్లను వాడటం లేదని.. బదులుగా అమెరికా సర్వర్లనే వాడుతున్నామన్నారు. ఈ రకమైన ప్రైవసీ నిబంధనలు మనం ఇప్పటికే విస్తృతంగా ఉపయోగిస్తున్న అనేక ఇతర యాప్‌ల లోనూ ఉండటం కొసమెరుపు!
– సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌

మరిన్ని వార్తలు