ట్రంప్‌ సర్కార్‌పై ఫేస్‌బుక్‌ సీఈఓ ఆరోపణలు

18 Jul, 2020 11:19 IST|Sakshi

కరోనా కట్టడిలో ట్రంప్‌ సర్కార్‌పై జుకర్‌ బర్గ్‌ విమర్శలు

అమెరికా ప్రభుత్వ  వైఖరి నిరాశపర్చింది 

వాషింగ్టన్‌: సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్  డొనాల్డ్‌ ట్రంప్‌ సర్కార్‌పై మరోసారి విమర్శలు గుప్పించారు.  కరోనావైరస్ సంక్షోభంపై ట్రంప్‌ ప్రభుత‍్వ వైఖరిపై నిరాశను వ్యక్తం చేశారు. కోవిడ్‌-19 నియంత్రణలో అనేక ఇతర దేశాలతో పోలిస్తే అమెరికా తీరు ఘోరంగా ఉందన్నారు. ప్రాథమిక నిబంధనల అమలుతో పాటు, సమగ్ర నివారణ చర్యలు తీసుకొని ఉంటే జూలైలో రెండవ దశ కరోనాను నివారించే అవకాశం ఉండేదన్నారు. 

అమెరికాకు చెందిన అంటువ్యాధుల నిపుణుడు డాక్టర్ ఆంథోనీ ఫౌసీతో ఇంటర్వ్యూలో జుకర్‌బర్గ్ మాట్లాడుతూ కరోనా నిర్ధారిత పరీక్షలు ఇప్పటికీ తగినన్ని అందుబాటులో లేకపోవడం నిజంగా నిరాశ కలిగిం చిందన్నారు.  ప్రజారోగ్య చర్యలపై శాస్త్రవేత్తల సలహాలను పాటించడం లేదనీ, నిపుణుల హెచ్చరికలను కూడా పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. దీంతో దేశంలోని టాప్‌ సైంటిస్టుల, సీడీసీ విశ్వసనీయత దెబ్బతింటోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 

ప్రపంచంలోని ప్రతి అభివృద్ధి చెందిన దేశంలో కరోనా కేసుల నమోదు తక్కువ స్థాయిలోఉంటే, అమెరికాలో మాత్రం రోజువారీ రికార్డు స్థాయి కేసులు నమోదవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాణాంతక వ్యాధి కట్టడిలో అనేక ఇతర దేశాలు తీవ్రంగా కృషి చేసినప్పటికీ, అమెరికా ఈ విషయంలో వెనుకబడిందని వ్యాఖ్యానించారు. భౌతిక దూరం, మాస్క్‌లు ధరించడం లాంటి ఇతర భద్రతా చర్యలు తీసుకోకుండానే చాలా రాష్ట్రాలు నిబంధనల ఎత్తివేతకు, ఆర్థిక కార్యలాపాల పునరుద్ధరణకు తొందరపడ్డాయని డాక్టర్ ఫౌసీ అభిప్రాయపడ్డారు. దీంతో ఆయా రాష్ట్రాలలో వైరస్‌ రెండవ దశ విజృంభణకు దారితీసిందన్నారు. కాగా కరోనా వైరస్‌పై తన వినియోగదారులకు  విశ్వసనీయ సమాచారాన్ని అందించేందుకు పలువురు శాస్త్రవేత్తలు, ఆరోగ్య నిపుణులతో మార్క్‌ జుకర్‌ బర్గ్‌  ఫేస్‌బుక్‌ లైవ్‌ ద్వారా వరుస ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. 

>
మరిన్ని వార్తలు