ఉద్యోగిపై వేటు : ఫేస్‌బుక్‌తో విసిగిపోయా!

13 Jun, 2020 12:09 IST|Sakshi

శాన్ ఫ్రాన్సిస్కో: జార్జ్ ఫ్లాయిడ్ హత్య, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ వివాదంలో మరో కీలక పరిణామం చేసుకుంది. సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ పై విమర్శలు చేసిన ఉద్యోగిపై సంస్థ వేటు వేసింది. మార్క్ నిర్ణయాన్ని వ్యతిరేకించిన ఇంజనీర్ బ్రాండన్ డైల్ ను విధులనుంచి తొలగించింది. దీనిపై వివరణ ఇస్తూ  డైల్ ట్విటర్ లో ఒక  పోస్ట్ పెట్టారు.  

బ్లాక్ లైవ్స్ మేటర్ ఉద్యమానికి మద్దతుకు నిరాకరించిన సహోద్యోగిని బహిరంగంగా తిట్టినందుకు తనను తొలగించినట్లు సియాటెల్ యూజర్ ఇంటర్‌ఫేస్ ఇంజనీర్ బ్రాండన్ డైల్ ట్వీట్  చేశారు. జాత్యహంకార వ్యతిరేక ఉద్యమానికి మద్దతుగా ప్రకటన చేయకపోవడం వెనుక రాజకీయ కోణం దాగి వుందన్న జూన్ 2 నాటి తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని డైల్ స్పష్టం చేశారు. తనను అన్యాయంగా తొలగించారని అనను కానీ సంస్థ వైఖరితో విసిగిపోయానని పేర్కొన్నారు. ట్రంప్ ను సమర్దించడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన కొంతమంది ఇంజనీర్ల బృందంలో డైల్ కూడా ఒకరు. మరోవైపు డైల్ తొలగింపును ఫేస్‌బుక్‌ కూడా ధృవీకరించింది. కానీ అంతకుమించి స్పందించేందుకు నిరాకరించింది. (జార్జ్ హత్య: మైక్రోసాఫ్ట్ ఉద్యోగుల లేఖ)

కాగా నల్లజాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ హత్యకు నిరసనగా ఆందోళనలు, నిరసన తెలుపుతున్న వారిని ఉద్దేశించి లూటీ చేస్తే..షూట్ చేస్తామంటూ ట్రంప్ హెచ్చరికలు ఫేస్‌బుక్‌లో వివాదాన్ని రగిలించాయి. దీనిపై ఆగ్రహాన్ని, అసంతృప్తిని వ్యక్తం చేసిన పలువురు ఉద్యోగులు ఒక సమావేశంలో  సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ ను నిలదీశారు. ట్రంప్ బెదిరింపు ధోరణి కంపెనీ పాలసీలను ఉల్లంఘించేదిగా ఉందని ఆరోపించారు. అయితే ట్రంప్ షేర్ చేసిన పోస్టులను అలా వదిలివేయాలన్న తన నిర్ణయంలో మార్పు ఉండదని జుకర్ బెర్గ్ స్పష్టం చేశారు. ట్రంప్ మెసేజ్ రెచ్చగొట్టేదిగా ఉందని తాను గానీ, తన పాలసీ టీమ్ గానీ భావించడం లేదని ఆయన వెల్లడించడంతో వివాదం మరింత ముదిరింది. ఇదే వివాదంలొ ఇప్పటికే తిమోతీ అనే  ఉద్యోగి ఈ నెల 1 న రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. 

>
మరిన్ని వార్తలు