ఫేస్బుక్ లో ఉన్నది నకిలీ ఫ్రెండ్స్..!

23 Jan, 2016 15:43 IST|Sakshi
ఫేస్బుక్ లో ఉన్నది నకిలీ ఫ్రెండ్స్..!

మనకు సమస్యలొస్తే ఫేస్బుక్ స్నేహితులు అసలు పట్టించుకోరట. పట్టించుకోవడం మాట దేవుడెరుగును కానీ అసలు మన బాధలు ఏంటన్నది కూడా తెలుసుకునే ప్రయత్నం కూడా చేయరట. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన బృందం చేసిన తమ సర్వేలో మరెన్నో నిజాలు, విషయాలు వెల్లడయ్యాయి. వర్సిటీకి చెందిన సైకాలజీ ప్రొఫెసర్ రాబిన్ డుంబార్ సుమారు 150 మంది ఫేస్బుక్ యూజర్స్ను సంప్రదించి వారిని ప్రశ్నించగా ఆసక్తికర వివరాలు బయటకొచ్చాయి.

సోషల్ మీడియా నెట్ వర్క్ ఫేస్బుక్లో అకౌంట్ ఉండటం ఆనవాయితీ అనే విధంగా నెటిజన్ల తీరు ఉంది. అయితే అదే సమయంలో ఆ ఫేస్బుక్ ఫ్రెండ్స్ లిస్టులో ఉండే వందల మంది వ్యక్తులు నిజంగా స్నేహితులేనా అంటే కచ్చితంగా కాదు అనే సమాధానాలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఫ్రెండ్స్ జాబితాలోని కేవలం నలుగురు, ఐదు మంది వ్యక్తులు మాత్రమే మన బాగోగులు చూస్తారని నమ్ముతున్నారట. కేవలం 15 మంది మాత్రమే తమ మిత్రుల సమస్యలను తమ బాధలుగా భావిస్తున్నారని ప్రొఫెసర్ డుంబార్ సర్వేలో తేలింది. ఫ్రెండ్స్ లిస్టులో ఉన్నవారిలో కేవలం 27శాతం వ్యక్తులు మాత్రమే అసలైన స్నేహితులని ఫేస్బుక్ యూజర్లు బదులిచ్చారట.

ప్రపంచమే ఓ కుగ్రామంగా ఈ రోజుల్లో మిత్రుల సంఖ్యను సోషల్ మీడియా ద్వారా చాలా సులువుగా పెంచుకోవచ్చు. నిజానికి ప్రాక్టికల్ గా ఆలోచిసినట్లయితే... ఈ స్నేహాలలో చాలా రకాలు ఉన్నాయట. నేరుగా కలిసి మాట్లాడి ఓ వ్యక్తితో స్నేహం చేస్తేనే ఆ వ్యక్తుల మధ్య ఫ్రెండ్షిప్ చాలా రోజులు ఉంటుండట. లేని పక్షంలో తమ ఫ్రెండ్స్ బాధలను, సంతోషం మొదలైన విషయాలలో జోక్యం చేసుకోరు, అసలు స్పందించే అవకాశాలు చాలా తక్కువని ప్రొఫెసర్ పేర్కొన్నాడు. ఐదు మంది మాత్రమే సన్నిహితులని, ఇతర గ్రూపులు, వ్యక్తుల ద్వారా పరిచయమైన వారిని వందల సంఖ్యలో ఫ్రెండ్స్ గా స్వీకరిస్తున్నారని సర్వేలో తేలింది. ఇప్పటికైనా ఫేస్బుక్ యూజర్స్ ఇలాంటి విషయాలను గమనించాలని సర్వే బృందం పేర్కొంది.

మరిన్ని వార్తలు