52 కంపెనీలకు డేటా లీక్‌

2 Jul, 2018 02:58 IST|Sakshi

అమెరికన్‌ కాంగ్రెస్‌కు ఫేస్‌బుక్‌ నివేదిక

యాపిల్, అమెజాన్, బ్లాక్‌బెర్రీ, శాంసంగ్‌ కంపెనీలకు సమాచారం

వాషింగ్టన్‌: తమ ఖాతాదారుల సమాచారాన్ని ప్రపంచవ్యాప్తంగా 52 కంపెనీలతో పంచుకున్నామని, వాటిలో చైనా కంపెనీలు కూడా ఉన్నాయని ఫేస్‌బుక్‌ వెల్లడించింది. సెల్‌ఫోన్‌ తయారీ కంపెనీలతో ఖాతాదారుల సమాచారం మార్పిడికి ఫేస్‌బుక్‌ ఒప్పందం కుదుర్చుకుందని ఇటీవల వార్తలు వెలువడిన నేపథ్యంలో అమెరికన్‌ కాంగ్రెస్‌కు శుక్రవారం ఆ కంపెనీ యాజమాన్యం వివరణిచ్చింది. ఏయే కంపెనీలతో యూజర్ల సమాచారాన్ని పంచుకున్నారో వెల్లడిస్తూ దాదాపు 700 పేజీల నివేదికను అమెరికన్‌ ప్రతినిధుల సభకు చెందిన హౌస్‌ ఎనర్జీ అండ్‌ కామర్స్‌ కమిటీకి ఫేస్‌బుక్‌ సమర్పించింది. 

యాపిల్, అమెజాన్, బ్లాక్‌బెర్రీ, శాంసంగ్, అలీబాబా, క్వాల్‌కాం, పాన్‌టెక్‌ మొదలైన వాటితో పాటు అమెరికా భద్రతకు ముప్పుగా ఆ దేశ నిఘా విభాగం పేర్కొన్న నాలుగు చైనా కంపెనీలు హ్యువాయ్, లెనోవో, ఒప్పో, టీసీఎల్‌లు కూడా ఉన్నాయి. ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించేందుకు, అలాగే ఆయా కంపెనీ ఉత్పత్తులతో ఫేస్‌బుక్‌ యాప్‌ అనుంధానం కోసం వివరాలు అందచేశామని ఫేస్‌బుక్‌ తెలిపింది.మొత్తం 52 కంపెనీల్లో 38 కంపెనీలతో ఒప్పందాలు ముగిశాయని, జూలైలో మిగిలిన వాటి కాలపరిమితి కూడా ముగుస్తుందని ఫేస్‌బుక్‌ తెలిపింది. తాజా వివరాలపై ఎనర్జీ అండ్‌ కామర్స్‌ కమిటీ సభ్యుడు ఫ్రాంక్‌ పల్లోనే స్పందిస్తూ.. ‘ఫేస్‌బుక్‌ స్పందన సమాధానాల కంటే మరిన్ని ప్రశ్నల్ని రేకెత్తిస్తోంది’ అని పేర్కొన్నారు.

>
మరిన్ని వార్తలు