స్తంభించిన ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, వాట్సాప్‌

4 Sep, 2018 12:37 IST|Sakshi

ప్రపంచంలోని పలు దేశాల్లో ఫేస్‌బుక్‌ దాని అనుబంధ సంస్థలు ఇన్‌స్టాగ్రామ్‌, వాట్సాప్‌ సేవలు స్తంభించిపోయాయి. అమెరికా, కెనడా, యూరప్‌లతో పాటు ఇండియాలో కూడా కొన్ని గంటల పాటు సేవలు నిలిచిపోయాయి. డౌన్‌ డిటెక్టర్‌ డేటా ఆధారంగా.. భారత కాలమానం ప్రకారం సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత 2.15 గంటల ప్రాంతంలో సేవలు ఆగిపోయాయి. సోషల్‌ మీడియా సేవలు నిలిచిపోవడంతో వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్విటర్‌ వేదికగా తమ అసంతృప్తిని తెలియజేశారు.

ఫేస్‌బుక్‌ వినియోగదారులు లాగిన్‌తోపాటు, పోస్టింగ్‌ సమస్యలు ఎదుర్కొన్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో తాము ఇటీవల పోస్ట్‌ చేసిన ఫొటోలు/సందేశాలు కనబడకపోవడంతో నెటిజన్లు ఆందోళన చెందారు. వాట్సాప్‌లోనైతే మెసేజ్‌లు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో ట్విటర్‌ను ఆశ్రయించిన నెటిజన్లు ఫేస్‌బుక్‌ నువ్వు ఎక్కడికి వెళ్లావు, ఫేస్‌బుక్‌ డౌన్‌.. లాంగ్‌ లీవ్‌ ట్విటర్‌.. అంటూ తమ సమస్యలను షేర్‌ చేశారు. దాదాపు రెండు గంటలకుపైగా ఈ సమస్య కొనసాగినట్టుగా తెలుస్తోంది. దీనిపై ఫేస్‌బుక్‌ అధికార ప్రతినిధి జే నాన్‌కర్రో స్పందిస్తూ.. సమస్య తలెత్తగానే తాము వెంటనే స్పందించామని, వీలైనంత త్వరగా సేవలు పునరిద్ధరించామని తెలిపారు. కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు