ఎక్కడో ఉండి, మరెక్కడో ఉన్నట్లు సెల్ఫీ దిగొచ్చు

14 Apr, 2016 19:58 IST|Sakshi
ఎక్కడో ఉండి, మరెక్కడో ఉన్నట్లు సెల్ఫీ దిగొచ్చు

శాన్‌ఫ్రాన్సిస్కో: ప్రపంచవ్యాప్తంగా సెల్ఫీల పట్ల పెరుగుతున్న మోజును దృష్టిలో పెట్టుకొని ఇందులో విప్లవాత్మక మార్పులకు తెరతీసింది ఫేస్‌బుక్. ప్రస్తుతం మనకు నచ్చిన ప్రాంతంలో, నచ్చిన వారితో సెల్ఫీ తీసుకోవాలంటే నచ్చిన వారిని తీసుకొని ఆ నచ్చిన ప్రాంతానికి భౌతికంగా వెళ్లాల్సిందే. ఇకముందు అలాంటి అవసరం ఉండదు. ఎక్కడ ఉన్నా మరో ప్రాంతంలో ఉన్నట్టు సెల్ఫీ దిగవచ్చు. నచ్చిన వారు కూడా మన పక్కనే ఉండాల్సిన అవసరం లేదు. పక్క పక్కనే ఉన్నట్లు సెల్ఫీ దిగవచ్చు. ఉదాహరణకు భారత్‌లో ఒకరుండి, లండన్‌లో ఒకరుండి, ఇద్దరు కలసి అమెరికాలో ఉన్నట్లు సెల్ఫీ దిగవచ్చు.

ఫేస్‌బుక్ ఇటీవలనే మార్కెట్‌లోకి విడుదల చేసిన వర్చువల్ రియాలిటీ యాప్, హెడ్‌సెట్‌ను ఉపయోగించి ఇలాంటి సెల్ఫీలను సాధించవచ్చని ఫేస్‌బుక్ మంగళవారం నాడిక్కడ నిర్వహించిన వార్షిక సమావేశ వేదికపై ప్రదర్శించి చూపింది. అందులో ఇద్దరు వీఆర్ హెడ్ సెట్ కలిగిన వారు సిలికాన్ వ్యాలీ పరిసర ప్రాంతాల్లో వేర్వేరు చోట్ల ఉండి, లండన్ వంతెనపై ఉన్నట్లుగా సెల్ఫీ దిగారు. అయితే ఆ ఛాయా చిత్రం మాత్రం ఆర్టిస్ట్ వేసిన రేఖా చిత్రంగానే కనిపించింది.

ప్రస్తుతం ఇది ప్రాథమిక దశలోనే ఉందని, ఇది భవిష్యత్ రియాలిటీకి నేడు పునాది వేయడమేనని ఫేస్‌బుక్ డెవలపర్ వివరించారు. వీడియో కాల్ ద్వారా ఒకరినొకరు చూస్తూ మాట్లాడుకోవడం ఎలా సాధ్యమైందో, అలాగే వర్చువల్ రియాలిటీ హెడ్‌సెట్‌కు వీడియో కాల్‌ను లింక్ చేయడం ద్వారా అసలైన చిత్రాల్లాగా సెల్ఫీలు ఉండేలా చేయవచ్చని చెప్పారు. ఆ దిశగా ప్రస్తుతం ప్రయత్నాలు కొనసాగుతున్నాయని అన్నారు.

మరిన్ని వార్తలు